www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కరివేపాకులోని కలిమి

కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. చేదు అని కాకరని, వాసన అని ముల్లంగిని త్రోసిపుచ్చినా కరివేపాకుని వాడని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు కదా! కరివేపాకు వేసిన కూరలు కమ్మదనాన్నే కాక సువాసనని కూడ చేర్చి నోరూరింప చేస్తాయి. పెరటిలో బద్దకించక కరివేపాకు మొక్కని నాటుకుంటే అవసరమైనప్పుడంతా తాజా కరివేపాకును వాడే భాగ్యానికి నోచుకోవచ్చు. ఇటీవల అటవీశాఖ వారు కూడ ఈ మొక్కలను సరఫరా చేయుచున్నారు. ఇది కొండ చరియలలోను, కొండ దిగువ భాగంలోను, హిమాలయములలోను, కాశ్మీరు నుండి కుమ్‌యోన్‌ వరకు వ్యాపించి ఉంది.

కరివేపాకు శాస్త్రీయ నామము 'మురయ కొనిగి'. నిమ్మ, చీనీ జాతులకు చెందిన 'రూటేసి' కుటుంబమునకు ఇది కూడా చేరినది. కరివేపాకు చెట్టు షుమారు 6 మీ|| ఎత్తు పెరిగి చూచేందుకు అందంగా, గుబురుగా, దృఢమైన సన్నని కాండంతో, శాఖలతో అలరారుతూ వుంటుంది. పుష్పములు శిఖర స్ధానంలో తెలుపులో, సువాసనాభరితమై వుంటాయి. ఫలములు పరిపక్వమైనపుడు నల్లగా వుండి, రెండు విత్తనములు కలిగి ఉంటాయి. ఆకులు సంయుక్త పత్రములు. వేళ్లు దృఢంగా వుండి అక్కడక్కడ చిరు మొక్కలను ఉత్పత్తిచేసి ప్రత్యుత్పత్తికి తోడ్పడుతాయి. కరివేపాకు చెట్టు వద్దకి వెళ్లినప్పుడు చుట్టూ క్రింద కొన్ని చిరుమొక్కలు వుండుట గమనించవచ్చు. కరివేపాకు ఆకులు ఎండిన కూడ దాని సువాసనను మాత్రం వదలదు.

తాజాగా సువాసన కలిగిన కరివేపాకు (నూరు గ్రాముల)లో ఈ క్రింది పోషకవిలువలు వున్నాయి.

  మాంసకృత్తులు    -    6.11 గ్రా.
  క్రొవ్వుపదార్ధము    -   1.0 గ్రా.
  కార్బోహైడ్రేట్లు    -   16 గ్రా
  పీచు    -   6.4 గ్రా.
  ఖనిజాలు    -   4.2 గ్రా.
  కరోటిన్‌    -   12,600 ఐ.యి.
  నికోటినిక్‌  ఆమ్లము    -   2.3 మి.గ్రా.
  విటమిన్‌ ' సి '    -   4 మి.గ్రా.

ఇంతేకాక  ఇది ఔషధ ప్రాముఖ్యాన్ని కూడ చాటుతున్నది. బెరడు, వేరు, ఆకులు - బలాన్ని, జీర్ణశక్తిని పెంపొందించి ఆకలిని కలిగించేందుకు, అజీర్తి నివారణకు ఉపయోగపడును. వాంతులు పోగొట్టేందుకు ఆకుల డికాషన్‌ పని చేయును. కరివేపాకు రెమ్మలను వంటలలో వాడుటే కాక ఎండిన ఆకులతో, పొడి, మసాలా పొడి, తాజా ఆకులతో చట్నీ చేస్తారు. పొడి శీతలాన్నిహరించి ఉష్ణాన్ని పుట్టించును. జీర్ణశక్తిని వృద్ధి చేయును. ఈ కారణము చేతనే దీనిని బాలింతలకి వాడెదరు. సువాసనతో పాటు, పోషక విలువలు, ఔషధ విలువలు కలిగిన కరివేపాకును వంటలలో వాడుటను వనితలు మరిచిపోకూడదు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in