|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కొత్త బైకు కొనేముందు ...
కొత్త ఏడాదిలో బైకు భలే ఉంటుంది కదూ. నలుగుర్నీ సలహా అడిగి చదివి మంచి కంపెనీ, అంతకంటే మంచి మోడల్ ఎన్నుకోగానే సరిపోదు మంచి కండీషన్ లో ఉన్న బండిని ఎంచుకోవటంలోనే ఉంది కిటుకంతా.
ఏ కంపెనీ అయినా తాము తయారు చేసే బైకులను మంచి కండిషన్ లో అందించాలనే చూస్తుంది అయినప్ప టికీ కొన్నిసార్లు తెలియకుండానే చిన్న చిన్న లోపాలు కనిపించవచ్చు. వీటిలో ఎక్కువ శాతం రవాణా సందర్భంగా చోటుచేసుకునేవే. అరుదుగా తయారీలోనూ లోపాలు కనిపించవచ్చు. అలాగని కొత్త బండి మొత్తాన్ని విడదీసి ప్రతి భాగాన్నీ పరిశీలించటం సాధ్యం కాదు. కాని, బయటకు కనిపించే భాగాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించటం ఇబ్బందేమీ ఉండదు.
బైకును ఎంచుకునేటప్పుడు ముందుగా చూడాల్సింది పెట్రోలు ట్యాంకు. దానిమీద ఎలాంటి సొట్టలు/గీతలు ఉండకూడదు. వెలుతురు బాగా ఉన్నచోట, సాధ్యమైతే ఎండలో బండిని పరిశీలించండి. చేతివేళ్లతో ట్యాంకు మీద సున్నితంగా అటూ ఇటూ స్పృశించండి. గరుకుగా అనిపించినా. సొట్ట పడినట్లు అనిపించినా ఇంకో బైకును చూడండి.
రవాణాలో ఎక్కువగా దెబ్బతినేవి క్లచ్, ముందు బ్రేకు లీవర్లు. చివర్లలో విరిగితే సులభంగానే గుర్తించవచ్చు. హ్యండిల్ తో కలిసేచోట రబ్బరు కప్పులుంటాయి. కాబట్టి, ఇక్కడ విరిగితే కనిపెట్టడం కొంత కష్టం. వాటిని జరిపి ఎక్కడైనా తేడాలున్నాయేమో చూడాలి.
ఇండికేటర్ లైట్లు విరిగిపోవడానికీ, పగిలిపోవడానికీ అవకాశం ఎక్కువ. కాబట్టి, వీటిని జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి సున్నితంగా కిందికి పైకి, పక్కలకు వంచి చూస్తే ఏమైనా విరిగిపోయినా, పగుళ్లున్న ఇట్టే తెలుసుకోవచ్చు.
బండిని స్టార్ట్ చేయండి. హెడ్ లైటులో ఉండే రెండు బల్బులూ సరిగ్గా పనిచేస్తున్నాయా, పార్కింగ్ లైటు, బ్లింకర్లు, వెనక లైటు, బ్రేక్ లైటు వెలుగుతున్నాయా చూడండి. ముందు, వెనక బ్రేకులు రెండింటిలో ఏది వేసినా లైటు వెలగాలి. లైట్లన్నీ వేసి హారన్ కొట్టినా శబ్దం బాగా రావాలి.
కొత్తవైనప్పుటికీ బైకులో కోన్ని భాగాలు తుప్పు పట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 'నట్లు', రంగువేయని జాయింట్ల దగ్గర ఇందుకు అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో, తీరప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగానే ఉంటుంది.
బైకుకు ఉన్న అన్ని రబ్బర్లూ సరిగ్గా ఉండేలా చూసుకోండి ఫుట్ రెస్ట్ లు, కిక్ స్టార్టర్, లివర్ జాయింట్ కవర్లకు ఎలాంటి పగుళ్లూ లేకుండా ఉండాలి. కొన్నిసార్లు టైర్లలోనూ సన్నని పగుళ్లు వస్తుంటాయి. రెండుమూడు చుట్లు తిప్పిచూసి అలాంటివేమైనా ఉన్నాయా,లేవా ? అని చూసుకోవాలి.
బ్యాటరీని కూడా జాగ్రత్తగా గమనించాలి. అందులో యాసిడ్ నిండుగా ఉండాలి. యాసిడ్ బయటకు రావడానికి పైపు ఉంటుంది. లేకపోతే బ్యాటరీలో ఉండే సల్ఫ్యూరిక్ ఆమ్లం బండి మీద పడుతుంది. బ్యాటరీని గట్టిగా బిగించారా? లేదా? అని చూసుకోండి. బ్యాటరీ వారంటీ కార్డు తీసుకోవడం మర్చిపోవద్దు. సాధారణంగా బ్యాటరీలకి ఏడాది వారంటీ ఉంటుంది. ఈ వ్యవధిలో సమస్య వస్తే బ్యాటరీ కంపెనీ దగ్గరకు వెళ్లాలి. బండి అమ్మిన డీలర్ వద్దకు కాదు.
స్టాండు తీసి బైకు మీద కూర్చోండి. తర్వాత ముందు బ్రేకు నొక్కుతూ బలంగా తోయండి. ఇలా ఐదారుసార్లు చేయండి. తర్వాత ఫోర్క్ లను గమనించండి. ఆయిల్ మరకల్లాంటివి కనిపిస్తే ఆయిల్ సీల్ లీక్ అవుతున్నట్లు. కొత్త ఆయిల్ సీళ్లు కూడా లీక్ అవుతుంటాయి. వాటిని గమనించేందుకే ఈ పరీక్ష.
ముందు చక్రాన్ని వేగంగా తిప్పితే స్పీడో మీటర్లో ముల్లు కదులుతూ ఉండాలి. అంకెలు కూడా మారాలి. చక్రం చప్పుడు లేకుండా సాఫీగా తిరగాలి. ఒకవేళ శబ్దం వస్తుంటే బ్రేకులు తాకుతున్నాయని అర్ధం. వెనక చక్రాన్ని కూడా తిప్పి పరిశీలించండి. తర్వాత ఇంజిన్ ను స్టార్ట్ చేసి చూడండి. సైలెన్సర్ నుంచి వెలువడే శబ్దం. టైమింగ్ చైన్ నుంచి వచ్చేసన్నని చప్పుడు తప్ప మరే చప్పుడూ ఉండకూడదు.
బండికుండే అన్ని కేబుల్సును ముందే సరిగ్గా గమనించాలి. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే, వీటికి ఎలాంటి వారంటీ ఉండదు.
బయటకు కనిపిస్తున్న అన్ని కరెంటు తీగలను పరిశీలించండి. వైర్లకు ఉండే ప్లాస్టిక్ రక్షణ పొర దెబ్బతింటే బ్యాటరీ నుంచి వచ్చే కరెంటు లీక్ అవుతుంది. బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుంది.
బండికి ఇవి ముఖ్యమండి
అధిక మైలేజి రావాలంటే గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. బండిని సజావుగా నడవడం. అతి వేగం, మరీ నిదానం రెండూ కూడా మైలేజి తగ్గడానికి కారణాలే. ముందున్న రోడ్డును గమనిస్తూ దానికి తగినట్లుగా బండిని నడపాలి. బ్రేకులూ, క్లచ్ ఎక్కువసార్లు వాడవొద్దు. పెట్రోలు కాక్, పైపు, ఫిల్టర్‌ను ప్రతిరోజూ గమనించాలి. వీటిలో ఏమైనా లీకేజీలు ఉన్నా మైలేజీలో తేడా వస్తుంది. నడిపే తీరు బాగున్నా నిర్వహణ సరిగ్గా లేకపోతే ఖర్చుకు అంతుండదు.
కంకర, గుంటలు ఉన్న రోడ్లపై బండిని నడిపితే ఆ కుదుపులకు నట్లూ బోల్టులూ వదులయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వీటిని గమనిస్తూ ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖర్చుకు సిద్ధం కావాల్సిందే!
చైను ఎప్పుడూ తగిన స్ధాయిలో బిగుతుగా ఉండాలి. వదులుగా ఉంటే స్ప్రాకెట్లు దెబ్బతింటాయి. ఎప్పటికప్పుడు దానికి గ్రీజు, ఆయిల్ వేయాలి. కొంతమంది చైను బాక్సును తెరిచి పెడతారు. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్ప్రాకెట్ల మీద చేరిన దుమ్ము, ధూళి చైను తిరగకుండా అవరోధం కల్పిస్తాయి. చైన్ స్ప్రాకెట్లను కిరోసిన్, బ్రష్‌లను వాడి తరుచుగా శుభ్రం చేస్తుండాలి.
ప్రయాణం సాఫీగా, కుదుపులు లేకుండా సాగడానికి సస్పెన్షన్లు మనకు కావల్సిన విధంగా సవరించుకునేందుకు వీలుగా ఉంటున్నాయి. నడిపే పద్ధతి, రోడ్డును బట్టి వీటిని సరి చేసుకోవచ్చు. అప్పుడు బైకు ప్రయాణం మరింత సుఖవంతమవుతుంది.
సాధ్యమైనంత వరకూ బ్రేకులు చాలా తక్కువగా వాడాలి. డిస్క్ బ్రేకుల ప్యాడ్లు ఏ మాత్రం దెబ్బతిన్నా వెంటనే మార్చాలి. బ్రేకులకు ఏదో రాసుకుంటున్నట్లు అనిపిస్తే అవి పాడయ్యాయని అర్ధం. ఎంత మందం డిస్క్‌ను వాడాలో చూసుకొని వేయించండి. దానిని మించి వాడవద్దు. డ్రమ్ము బ్రేకుల్ని ఎప్పటికప్పుడు సరిచేయించండి.
బైకు కుండే కేబుళ్లను కనీసం వారానికోసారైనా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమాత్రం పాడైనా కొత్త వాటిని వేయించండి. అన్ని కేబుళ్లు కూడా ఆయిల్ వేసి జారుడుగా ఉండేలా చూసుకోండి. లేకపోతే అత్యవసర సమయాల్లో మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
బండిలో ఉన్న ఎలక్ట్రికల్ వ్యవస్ధ పనితీరు సక్రమంగా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. బండిలో ఎక్కడా వైర్లు తేలి ఉండకూడదు. వర్షంలో తడిసినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. లైట్లు, ఇండికేటర్లు, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోండి.
టైర్లు పూర్తిగా పాడయ్యి, దారాలు తేలే దాకా ఉపయోగించవద్దు. టైర్లమీద కనీసం 2 ఎం ఎం ట్రేడ్ ఉంటేనే అవి సమర్ధంగా పనిచేయగలవు. ఉండాల్సినంత గాలి ఒత్తిడి తగ్గకుండా చూసుకోవాలి. లేకుంటే టైర్లకూ, రోడ్డుకూ మధ్య ఘర్షణ పెరిగిపోతుంది. ఫలితంగా వేగంతోపాటు, మైలేజీ మందగిస్తుంది.
మైలేజీకిదే రాచబాట
"బైకు ఎందుకు కొన్నాంరా బాబు!" పెట్రోలు ధర లీటరుకు అయిదు నుంచి పది రూపాయల వరకూ పెరగొచ్చన్న మాటలు వినిపించినప్పుడల్లా బైకు యజమానులు ఇలా అనుకుంటూనే ఉంటారు. అనుకోవటమే తప్ప బండిని ఎవరు వదులుకోగలరు చెప్పండి.గాలి వాటం సిటీ బస్సులను నమ్ముకుని? మనం చేయగలిగిందల్లా మైలేజీ ఎక్కువ వచ్చేలా జాగ్రత్తపడటమే.
ఇందుకు మీరేం చేయాలంటే?
అన్నింటి కంటే ముందు రెండు టైర్లలో గాలి నిండుగా ఉండేట్లు చూసుకోవాలి.
రెండు టైర్లు సరిగ్గా తిరుగుతున్నాయా లేదా ఒక్కసారి పరిశీలించండి. బ్రేకులకు కానీ, ఇతర విడిభాగాలకు కానీ మరీ బిగుతుగా ఉండి టైర్లను పట్టుకున్నట్లు ఉంటే అవి స్వేచ్చగా పరుగులెట్టవు. టైర్లు సరిగ్గా తిరగట్లేదన్న అంశాన్ని కనిపెట్టడమెలా? ఇందుకోసం ముందుగా మెయిన్ స్టాండ్ వేయండి. ఇంజిన్ స్టార్ట్ చేయకుండా చేతిలో రెండు టైర్లను తిప్పండి. బ్రేకులు ఎక్కడైనా పట్టుకుంటున్నట్లు అనిపిస్తే వెంటనే సరి చేయించండి.
చెయిన్, స్ప్రాకెట్లను నిత్యం శుభ్రం చేయాలి. కందెన (ల్యూబ్రికెంట్)ను తప్పక వాడాలి.
క్రమం తప్పకుండా టైర్ల అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ చేయించాలి. రిమ్ములు వంగినట్లుంటే వెంటనే సరి చేయించాలి.
నాణ్యమైన ఇంజిన్ ఆయిల్ ను సరైన నిష్పత్తిలో వాడాలి. లేకపోతే కొత్త బండి అయినా సరే.. ఇంజిన్ మొరాయించటం ఖాయం.
చెయిన్ అటు వదులుగా కాకుండా ఇటు బిగుతుగా లేకుండా ఉండాలి.
ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్‌లను తరచూ శుభ్రం చేయాలి. కార్బ్యురేటర్ శుభ్రంగా ఉంచటంతో పాటు ట్యూన్ చేస్తుండాలి.
క్లచ్ జారుతున్నట్లు కాకుండా తగినంత బిగువుగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు
మొదటి గేరు వేశాక క్లచ్‌ను నెమ్మదిగా వదలాలి. బైకు వేగం 10 కిలోమీటర్లను మించకూడదు. అనవసరంగా ట్రాటిల్ ఇవ్వద్దు. ఆ తర్వాత నిదానంగా ఒక్కొక్క గేరు మార్చుకుంటు వెళ్లాలి. టాప్ గేర్ లోకి వెళ్లాక బండి వేగం యాబై కిలోమీటర్ల వేగం అందుకున్నా పర్వాలేదు.
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద 15 సెకన్ల కంటే ఎక్కువ సేపు బండి ఆపితే. ఇంజిన్‌ను నిలిపివేయండి. అంతకంటే తక్కువ సేపుంటే న్యూట్రల్‌కి వెళ్లాలి. గేర్‌లో క్లచ్‌ను నొక్కితే ఇంజిన్‌పై భారం పెరగటంతో పాటు పెట్రోల్ వృధా అవుతుంది. క్లచ్‌లూ పాడవుతాయి.
పచ్చబల్బు పడగానే తోటి వారికంటే వేగంగా దూసుకెళ్లటం సంతోషం కలిగించినప్పటికీ బైకు పెట్రోల్ ఎక్కువ తాగేస్తుంది. దీని ప్రభావం మైలెజీపై పడుతుంది. ఈ కారణంగానే బజాజ్ పల్సర్, కరిజ్మా, ఫియరో, విక్టర్ తదితర బైకుల్లో మైలేకీ కొన్నిసార్లు తగ్గుతుంటుంది.
ఏటవాలు ప్రాంతాల్లో బైకును న్యూట్రల్ లో నడిపించటం తెలివైన పద్ధతి కాదు. ఇంజిన్ స్విచ్చాఫ్ చేసి నడపకూడదు. ఎత్తైన ప్రాంతం నుంచి కిందికి దిగుతుంటే ట్రాటిల్ ఇవ్వం కాబట్టి పెట్రోల్ ఎక్కువ ఖర్చయ్యే అవకాశాలే లేవు.
వేగంగా బైకు తోలాలని భావించే కుర్రకారంతా ఓ విషయం గుర్తుంచుకోవాలి. జోరు ఎంత ఎక్కువైతే పెట్రోల్ అంత ఎక్కువ ఖర్చు అవుతుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగం వెళుతున్నమనుకోండి... కేవలం గాలి నిరోధకాన్ని అధిగమించటానికే నలభై శాతం పెట్రోల్ ఖర్చవుతుంది. యాబై కిలోమీటర్ల స్పీడులో వెళితే యాభై శాతం పెట్రోల్ ఖర్చవుతుంది.
ఏ గేర్‌లో ఎంత వేగం?
కొత్త బైకును మొదటి వెయ్యి కిలోమీటర్ల వరకూ తక్కువ వేగంతో నడపాలి. ఇక బండిని మొదటి గేరులో నడుపుతున్నప్పుడు జర్కులు వస్తున్నాయంటే బండి నడపడంలో లోపం ఉన్నట్లు లెక్క నడపడం అలవాటైతే సాఫీగానే లాగించగలుగుతారు. మొదటిగేరులో 7, రెండోదానిలో 15, మూడోదానిలో 30, నాలుగో గేరులో 40, ఐదో గేరులో 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తే బాగుంటుంది. ఉచిత సర్వీసింగ్ సమయంలో ఇంజినీర్ కు చిన్న చిన్న విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇంజిన్‌కు సంబంధించిన సమస్యలు ఎదురవుతుంటే మాత్రం తప్పని సరిగా చెప్పాలి. ఇక ఆయిల్ ఎంత వాడాలనే విషయం ఓనర్స్ మాన్యువల్ లో ఉంటాయి. ఒకసారి దాన్ని మొత్తం చదవండి.
మూలం - ఈనాడు దినపత్రిక (సిరి) మే 12, ఫిబ్రవరి 24, ... 2006 (దిలీప్బామ్).
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in