www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంచితేనే నడుము

నేటి తరానికి నడుము నొప్పి ఓ తీవ్రమైన వేదన. ఇలాంటి సమస్యలన్నింటికీ చాలా వరకూ మన జీవన శైలినే కారణంగా చెప్పుకోవాలి. గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పనిచేసే వారికీ, మహిళలకూ ఈ సమస్య అధికం. యోగాసనాల ద్వారా నడుము నొప్పి బాధల నుంచి చక్కటి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఉపకరించే కొన్ని ప్రాథమికమైన యోగాసనాలు చూద్దాం.

1. భుజంగాసనం

ప్రారంభ స్థితి - బోర్లా పడుకొని. ముఖాన్ని నేలకు ఆనించాలి. రెండు కాళ్ళనూ దగ్గరగా ఉంచాలి. కాలి మడమలు పైకి ఉండాలి. అరచేతుల్ని భుజాలకు ఇరువైపులా నేలకు ఆనించాలి.

ఎలా చేయాలి - శ్వాస నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ తల పైకెత్తుతూ వెన్నెముకను వీలైనంత వెనక్కి వంచి. అదే స్థితిలో కొంత సేపుండాలి. పొత్తి కడుపు ప్రాంతాన్ని నేలకు ఆనించి ఉంచి, వీలైనంత సేపు శ్వాస బిగపట్టాలి. శ్వాసను నిలపటం ముఖ్యం. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ ప్రారంభ స్థితికి రావాలి. ఇలా అయిదు సార్లు చెయ్యాలి.

2. ఊర్ధ్వముఖ శ్వాసాసనం

ప్రారంభ స్థితి - పొట్ట మీద పడుకోవాలి. కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచి, వేళ్లను నేలకు ఆనించాలి. శరీరం నేలకు తాకకూడదు. శరీరం బరువంతా అరచేతులు, కాలివేళ్ల మీదే ఉండాలి. చేతి వేళ్లు తలవైపుకు తిప్పి ఉంచాలి.

ఎలా చేయాలి - శ్వాస తీసుకుంటూ తల, శరీరాన్ని పైకెత్తుతూ, వెన్నెముకను వీలైనంత వెనక్కి వంచాలి. మోకాళ్లు నేలకు తాకకూడదు. ఛాతికిందికి రావాలి. తల వెనక్కి వంచాలి. మోకాళ్లు, తొడలు బిగుతుగా ఉండాలి. ఇదే స్థితిలో కొద్దిసేపు శ్వాసతీసుకుంటూ ఉండి, తర్వాత మళ్లీ ప్రారంభ స్థితికి రావాలి.

 

3. శలభాసనం

ప్రారంభ స్థితి - పొట్ట మీద బోర్లా పడుకోవాలి. రెండు చేతుల్నీ తొడల కింద ఉంచాలి.

ఎలా చేయాలి - శ్వాస లోపలికి తీసుకుంటూ రెండు కాళ్లనూ, నడుము దగ్గరి నుంచి ఒకే సారి నిలువుగా పైకెత్తాలి. శ్వాసను బిగబట్టి కొద్దిసేపు ఇదే స్థితిలో ఉండాలి. నెమ్మదిగా శ్వాస బయటకి వదులుతూ కాళ్లను నేల మీదికి తీసుకురావాలి. ఒకేసారి రెండు కాళ్లూ ఎత్తటానికి వీలు కాకపోతే, ఒక కాలు తర్వాత మరొకటి పైకెత్తుతూ సాధన చెయ్యచ్చు.

4. తాడాసనం

ప్రారంభ స్థితి - రెండు కాళ్లనూ ఆంగ్ల అక్షరం 'వి' ఆకారంలో ఉంచి నిటారుగా నిలబడాలి.

ఎలా చేయాలి - నెమ్మదిగా లోపలికి శ్వాస తీసుకుంటూ చేతులను పక్కవైపుల నుంచి తలపైకి ఎత్తాలి. కాలి ముని వేళ్లపైన బరువు వేస్తూ శరీరాన్ని వీలైనంత పైకెత్తాలి. ఈ స్థితిలో శ్వాస బాగా తీసుకోవటం చాల ముఖ్యం. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ ప్రారంభ స్థితికి రావాలి.

5 మకరాసనం

ప్రారంభ స్థితి - పొట్టమీద బోర్లా పడుకోవాలి.

ఎలా చేయాలి - నెమ్మదిగా తలను భుజాల్ని పైకెత్తి గడ్డాన్ని రెండు చేతుల మీద ఉంచాలి. కళ్ళు మూసుకుని వీలైనంత సేపు ఇదే స్థితిలో ఉండటానికి ప్రయత్నించాలి. మనసును వెన్నెముక భాగం మీద కేంద్రీకరించటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.ఈ స్థితిలో శరీరం బాగా విశ్రాంతి పొందుతుంది.

 

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in