www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

హాస్య సంపద

[ వెనుకకు ]  [ ముందుకు ]

పేపరు ఎలా వుంది?

తండ్రి: లెక్కలు పరీక్ష రాసి ఇంటికి వచ్చిన బాబీని ఇలా అడిగాడు 'ఏరా బాబీ పేపరు ఏవిధంగా వుంది? మార్కులు ఎలా వస్తాయి?'

బాబీ: 'పేపరు దీర్ఘ చతురస్త్రాకారంలో వుంది నాన్నా! మార్కులు మాత్రం వృత్తాకారంలోనే వస్తాయి'. అంటూ గదిలోకి తుర్రుమన్నాడు.

ఫోన్ కనెక్షన్

కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన ఓ కుర్రలాయరు, మొట్టమొదటి క్లయింటు తనకోసం రావడం గమనించి, అతనికి తను చాలా బిజీగా వున్నట్లు నమ్మకం కలిగించే ప్రయత్నంగా ఫోన్ అందుకున్నాడు. 'హలో, ఎవరు? రావ్ గారా, గుడ్‌మార్నింగ్ సార్ ఏమిటి నాతో అవసరముందా? సారీ సార్. నేను నా క్లయింట్స్‌తో బిజీగా వున్నాను. నా ద్వారా మీకు ఎలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలన్నా నా దగ్గరకొచ్చి కలవండి. మీరెంత గొప్పవారైనా నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌కి అందుబాటులో వుండి వారికి అన్ని విధాలా సహాయపడటమే నాధర్మం. క్షమించండి. వుంటాను. బై!'  అని ఫోన్ పెట్టేసి ఆ వ్యక్తి వైపు చూసి నవ్వుతూ చెప్పండి, ఎందుకొచ్చారు అని అడిగాడు.

ఆ వ్యక్తి అదే చిరునవ్వుతో అన్నాడు.'నేను టెలికం డిపార్ట్‌మెంటు నుండి వచ్చాను. మీ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి'.

అబ్బాయి నడుస్తున్నాడు

'యావండోయ్, మన అబ్బాయి వారం రోజుల నుండి నడుస్తున్నాడు'. సంతోషంగా అంది ప్రొఫెసర్‌తో భార్య.

 తుళ్ళిపడ్డాడు ప్రొఫెసర్. 'నీకసలు బుద్దుందా? వారం రోజులంటే అప్పుడే చాలాదూరం వెళ్ళిపోయి వుంటాడు. వెంటనే పోలీసులకు ఫోను చెయ్యి.'

క్వశ్చన్ పేపర్

ఈరోజు పేపర్లో ఏయే ప్రశ్నలడిగారు? పరీక్ష రాసి ఇంటికి వచ్చిన కొడుకును అడిగాడు తండ్రి..

నీకు నచ్చని వస్తువు ఏమిటి? అని అడిగారు.

అలాగా! అయితే సమాధానం ఏమి రాశావు? ఆసక్తిగా అడిగాడు తండ్రి.. నాకు ఈ ప్రపంచంలో నచ్చని వస్తువు  ఏదైన వుంటే అది క్వశ్చన్ పేపర్ అని రాశాను.

సమయానికి

ప్రతి రోజూ ఆఫీసుకి ఆలస్యంగా వచ్చేవాడు సతీష్. ఒకరోజు కరెక్ట్ టైముకు ఆఫీసుకు రావడం చూసి అతని బాస్ ఈ విధంగా అడిగాడు.

బాస్: ఏంటయ్యా! నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ రోజు ఆఫీసుకు సమయానికి ఎలా రాగలిగావు.

సతీష్: నా భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్ళారండి.

బాస్: దానికి, నువ్వు ఆఫీసుకి తొందరగా రావడానికి ఏమిటి సంబంధం?

సతీష్: ఈ రోజు నా ఒక్కడికే బ్రేక్‌ఫాస్ట్ తయారు చేశాను.

మహర్జాతకురాలు   

హాలిడే ట్రిప్ మీద ఓ బిజినెస్ మాగ్నెట్ తన భార్యతో కలిసి వెళ్తున్నాడు. దారిలో పెట్రోలు పోయించేందుకు ఓ చోట కారు ఆపాడు. పెట్రోలు పోసే వ్యక్తిని భార్య గుర్తు పట్టి భర్తకు పరిచయం చేసింది. అతడు డిగ్రీలో ఆమె క్లాస్‌మేట్. కారు మళ్ళీ కదిలింది.

ఒకప్పుడు అతన్ని నేను ప్రేమించాను తెలుసా! దాపరికం లేకుండా ఆమె తన భర్తతో చెప్పింది.

చూశావా నీదెంత అదృష్టమో అన్నట్టు భర్త భుజాలెగరేసి నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోయుంటే ఎలా ఉండేదో ఓ సారి ఊహించుకో అన్నాడు.

ఏముంది అతడు నీలా దర్జాగా కార్లో తిరుగుతుండేవాడు.నువ్వేమో పెట్రోలు బంకులో ఉండేవాడివి భార్య బదులిచ్చింది.

నేమ్ ప్లేట్

ప్రకాష్ ఇంటికి వచ్చిన రమేష్ బయటవున్న నేమ్ ప్లేట్‌ను చూసి ఈ విధంగా అడిగాడు.

రమేష్: ప్రకాష్! పోయిన సంవత్సరం మీ ఇంటికి వచ్చి చూసి బయట నేమ్ ప్లేట్ మీద నీపేరు పక్కన బి.ఏ అని చదివాను. ఈ సంవత్సరం ప్రకాష్. ఎం.ఏ అని వుంది. మాస్టర్ డిగ్రీ ఎప్పుడు చదివావు?

ప్రకాష్: నీకు తెలీదా? పోయిన సంవత్సరం నా భార్య చనిపోయింది. అందుకని బి.ఏ. పెట్టుకున్నాను. బి. ఏ అంటే బాచులర్ ఎగైన్ అని. ఈ సంవత్సరం నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. అందుకని ఎం. ఏ అని నేమ్ ప్లేట్ మార్చేశాను. ఎం. ఏ అంటే మారీడ్ ఎగైన్ అని అర్థం.

డిటో డిటో

ఒక ఆఫీసులో స్టాఫ్ రోజూ ఆఫీసుకు లేటుగా వస్తుంటారు. దానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఎడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జి అయిన ఆఫీసర్ రిజిస్టర్‌లో లేటుగా రావడానికి కారణం ఏమిటి? అని కొత్తగా ఒక కాలం పెట్టాడు. అయినా సమస్య అలాగే వుంది. స్టాఫ్ అందరూ లేటుగా వచ్చి నందుకు క్షమించమని రాసేవారు. అలాగే మొదట లేటుగా వచ్చిన వ్యక్తి లోకల్ ట్రైన్ లేటుగా వచ్చిందని, రోడ్డు మీద ట్రాఫిక్ జాం అయిందని రాసేవారు. ఆతర్వాత వచ్చిన వారందరూ దానికి డిటో, డిటో అని పెట్టి సంతకాలు చేసేవారు. ఒకరోజు ఒక మహిళా ఉద్యోగి ముందుగా వచ్చి గైనిక్ సమస్య వల్ల లేడీ డాక్టర్ ను కలిసి వస్తున్నాను అని ఆమె లేటుగా రావడానికి కారణం రాసింది. ఆ తర్వాత వచ్చిన మిగతా అందరూ యధావిధిగా డిటో, డిటో అని రాసి సంతకాలు చేశారు.

ఎవరు వచ్చింది?

సాయికృష్ణ భార్య విచారంగా ముఖం పెట్టి పక్కింటి సోమేశ్వర్ భార్యని ఓ రోజు ఇలా అడిగింది.

సాయికృష్ణ భార్య: మీ వారు రోజూ రాత్రిళ్ళు లేటుగా ఇంటికి వచ్చేవారు కదా! ఆ అలవాటు ఎలా మానిపించారు. ఈ మధ్యన చాలా తొందరగా ఇంటికి వస్తున్నారు. నాకు కూడా ఆ ఉపాయం చెప్పండి?

సోమేశ్వర్ భార్య: వెరీ సింపుల్! ఒక రోజు మా వారు మామూలుగా లేటుగా వచ్చారు. అప్పుడు నేను కళ్ళు తెరవకుండానే ఎవరు వచ్చింది రామారావా? అని అడిగాను. అంతే! అప్పటి నుంచి లేటుగా రావడం మానేశారు.

కట్నమా? మర్యాదా?

సుబ్బారావు: అవినాష్! నువ్వు ఊర్లో లేనప్పుడు మన గోపి పెళ్లి అయింది తెలుసా?

అవినాష్: ఆ విన్నాను. ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నాడట కదా?

సుబ్బారావు: ఆ ఏంచేస్తాడు మరి?

అవినాష్: ఏమయింది?

సుబ్బారావు: పెళ్ళి చూపుల్లో పెళ్ళికూతురు నీకు జీవితాంతం నేనిచ్చే గౌరవ మర్యాదలు కావాలా? లేక కట్నం కావాలో తేల్చుకోండి అని అందట అందుకని కట్నం లేకుండా చేసుకున్నాడు.

రెండు చెంచాలు

సర్వర్:  అరెరెరె ... ఇదేంటి తమరు రెండు చెంచాలు తీసుకెళ్తున్నారు?

రామయ్య: డాక్టర్ గారి ఆజ్ఞ

సర్వర్: అంటే?

రామయ్య: కోటు జేబులో నుంచి టానిక్  తీసి చూడవయ్యా దీనిపై భోజనం చేసిన తరువాత ప్రతిసారి రెండు చెంచాలు తీసుకోవాలి అని రాసి  వుంది మరి.

నేనెవరు?

ఒరే బుడుగు ఎందుకేడుస్తున్నావు? అడిగాడు టింకు.

నాన్న అమ్మని పనికిమాలిన దరిద్రపు పీనుగ అని తిట్టాడు చెప్పాడు బుడుగు.

అయితే...

అమ్మ నాన్నని బుద్దిలేని అడ్డగాడిద అని తిట్టింది.

అది సరే! నువ్వెందుకు ఏడుస్తున్నావు

మధ్యలో నేనెవరో తెలియక!

ఇది పెయింటింగా?

ఈ చిత్ర కళాప్రదర్శనలో నీకు నచ్చిన చిత్రం ఏమిటీ అడిగాడు శివ.

హరి ఓ చిత్రాన్ని చూపించి ఈ చిత్రం చాలా బాగుంది. చూస్తుంటే నోరూరుతుంది. అన్నాడు. అదేమిటి ఉదయిస్తున్న సూర్యుని చిత్రపటాన్ని చూసి నోరూరుతుందా? ఆశ్చర్యపోయాడు శివ.

నిరాశపడిపోయాడు హరి. అది ఉదయిస్తున్న సూర్యుని చిత్రమా? నేనింకా వేయించిన కోడిగుడ్డు అనుకున్నాను.

నెయిల్ పాలిష్!

తల్లి: నీళ్ళు వేడిగా వున్నయో లేదో బకెట్ లో చేయి పెట్టి చూడమంటే అలా ఆలోచిస్తావేంటి?

టీనేజ్ అమ్మాయి: గోళ్ళకున్న నెయిల్ పాలిష్ పోతుందేమోనని అసలు విషయం చెప్పింది కాలేజీలో చదివే ఈ తరం అమ్మాయి.

ప్రభుత్వ ఉద్యోగం

ఏమిటి? మీ బెడ్ రూం లో బల్ల కుర్చీ వేశారు. మీ ఇంట్లో సెపరేట్  డ్రాయింగ్ రూం లేదా?

మా ఆయన ఆ కుర్చీలో కూర్చొని బల్లమీదికి వంగి నిద్రపోవడం అలవాటు. ఆయన చేసింది ప్రభుత్వ ఉద్యోగం కదా! అలవాట్లు ఎక్కడికి పోతాయ్ !

జనాభా లెక్కలు

ఒకాయన జనాభా లెక్కల కోసం ఒక ఇంటికి వెళ్ళాడు.

ఆ ఇంటి ఇల్లాలు ఇలా చెప్పింది. మీకు కరెక్టుగా మా ఇంటి జనాభా లెక్క కావాలంటే ( కుటుంబ సభ్యులు ) రెండ్రోజులు ఆగి రండి

ఎందుకని?

మా అత్తగారు కాశీ తీర్థయాత్రలకు వెళ్ళారు. ఆవిడ ఇంకా తిరిగి రాలేదు. మాకెందుకో అనుమానంగా వుంది. అందుకని!

రక్తం

కోమలి: పాపం పక్కింటి మీనాక్షి చాలా కష్టాలు పడుతోందండీ!

భర్త: ఎందుకు?

కోమలి: ఆమె భర్త రోజురోజుకీ మరీ రాక్షసుడిలా తయారవుతున్నాడు.

భర్త: అవును మొన్న ఆ మధ్య ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా రక్తం పోయిందట. అప్పుడు ఆమె రక్తమే ఎక్కించారట. అప్పటి నుంచి అలా అయిపోయాడు ఆయన.

పేపరు

పరీక్ష పేపరు ఔట్ చేయించినా పాస్ కాలేదేమిటి? అని అడిగాడు తన కొడుకు పదో తరగతి పరీక్ష ఫెయిల్ అవడం చూసిన రాజకీయ నాయకుడు

పేపరు లీక్ చేయించావు కానీ, పరీక్ష హాల్లో నా ముందు తెలివైన విద్యార్థిని వేయించలేకపోయావు కదా! అన్నాడు కొడుకు బాధగా.

వెయిటింగ్ రూం

తాను ఎక్కవలసిన రైలు ఎంతసేపటికి రాకపోవడంతో ఒక పాసింజర్ స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి ఒక్క రైలు కూడా టైముకు రాదు ఇంకెందుకు స్టేషన్‌లో రైల్వే టైం టేబుల్ పెట్టడం తీసేయండి. అన్నాడు ఆవేశంగా.

రైళ్ళు కరెక్ట్ టైముకి వస్తే ఇంక వెయిటింగ్ రూం లు ఎందుకు మీకు అన్నాడు అంతే ఆవేశంతో స్టేషన్ మాస్టర్.

నమ్మకం

డాక్టర్ దగ్గరకు పరీక్ష చేయించుకోవడానికి వచ్చింది అమిత. డాక్టర్ పరీక్ష చేయబోతుంటే ఈ విధంగా అంది.

అమిత: ఒక్క నిమిషం డాక్టర్! బయట కూర్చున్న నాభర్తను కూడా లోపలికి పిలవండి.

డాక్టర్: ఎందుకు? మీకు నామీద నమ్మకం లేదా?

అమిత: మీమీద నమ్మకం వుంది డాక్టర్! కానీ నా భర్తమీదే లేదు.

డాక్టర్: ఎందుకు?

అమిత: బయట నా భర్త మీ నర్స్ తో ఒంటరిగా కూర్చొని వున్నారు.

ఉత్తమ పొదుపరి

విద్యుత్‌ను ఆదా చేసినందుకు పిసినారి పాపయ్యకు ఉత్తమ పొదుపరి అనే ప్రత్యేక అవార్డును ప్రధానం చేసింది. ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి అతని పొదుపు సుగుణాలను కొనియాడారు.

అనంతరం విలేకర్లు పాపయ్యను చుట్టుముట్టారు. ఒక సంవత్సర కాలంలో కేవలం రెండే యూనిట్లను ఎలా వాడగలిగారు అని అడిగారు.

ఆ ఏముంది దీపం ఆరిపోయినప్పుడల్లా అగ్గిపెట్టె వెతకటానికి మాత్రమే లైటు వేసేవాడిని సంక్షిప్తంగా జవాబిచ్చాడు పాపయ్య.

కలసికట్టుగా

టీచర్ క్లాసులో పాఠం చెబుతుండగా మధ్యలో విద్యార్థులతో ఇలా అన్నాడు.

టీచర్: మీరందరూ కలసికట్టుగా ఐక్యమత్యంతో ఉండాలి.

కొంటె విద్యార్థి: అలా ఉందామనే అనుకున్నాం సార్! కానీ మీరు ఒప్పుకోలేదు కదా!

టీచర్: మధ్యలో నేనేం చేశాను రా?

కొంటె విద్యార్థి: మొన్న జరిగిన పరీక్షల్లో అందరం ఒకచోట కలసికట్టుగా కూర్చొని రాస్తుంటే మీరే కదా మమ్మల్ని విడదీశారు.

వినికిడి లోపం

రాజయ్య ఒక వైద్యుడి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు.

రాజయ్య: డాక్టర్ గారూ! నాకు చెవులు సరిగా వినిపించడం లేదు. కాస్త పరీక్షిస్తారా? అని అడిగాడు

అతని చెవులు పరీక్షించిన తరువాత

డాక్టర్:  మీ చెవులు సరిగ్గా వినిపించాలంటే చెవులకు మిషన్ పెట్టాలి. ఈ మిషన్ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. దీన్ని నేను కూడా వాడుతున్నాను. అంటూ తనచెవికి వున్న హియరింగ్ ఎయిడ్ చూపించాడు డాక్టర్.

రాజయ్య: ఇది ఏ కంపెనీది. ఎక్కువరోజులు మన్నుతుందా? దీని ఖరీదు ఎంత?

డాక్టర్: ఏమిటీ! ఇప్పుడు టైము ఎంతైంది అని అడుగుతున్నావా? నాలుగున్నర అయింది.

అదే నేనైతే

ఒకరైల్వే కంపార్ట్‌మెంట్‌లో రాజు, రాధ కూర్చొని వున్నారు. రాజు పేపరు చదువుకుంటూ సిగరెట్ కాలుస్తున్నాడు. అది చూసిన రాధ కోపంగా లేచి నిలబడి నువ్వే కనుక నా భర్తవి అయితే టీలో విషం కలిపి ఇచ్చేదాన్ని అంది.

నువ్వే కనుక నా భార్యవి అయితే ఆ టీని తాగేసే వాడిని అన్నాడు రాజు.

చూడలేక

బాగా రద్దీగా ఉన్న బస్సులో ఇద్దరు స్నేహితులు కూర్చొని వున్నారు. వారిలో ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అది చూసిన రెండవ  వ్యక్తి ఈ విధంగా అడిగాడు.

ఏమిటి? అలా కళ్ళు మూసుకొని కూర్చున్నావు. వంట్లో నలతగా వుందా?

లేదు నేను ఆరోగ్యంగానే వున్నాను. ఇంతమంది స్త్రీలు నిలబడి  వుండటం చూడలేక నేను కళ్ళు మూసుకున్నాను. అన్నాడు కళ్ళు తెరవకుండా.

ఫోటో

రాజూ! నాకు పెళ్ళయిపోయింది. నేను రాసిన ఉత్తరాలు నా ఫోటోలు నీ దగ్గర వున్నవి వెంటనే పంపించు. మా వారికి తెలిస్తే బాగుండదు. అని ఉత్తరం రాసింది రాధ.

దానికి సమాధానంగా రాజు దగ్గర నుంచి పెద్ద కవరు వచ్చింది. దాంట్లో ఫోటోలతో పాటు ఓ కాగితం మీద ఇలా రాశాడు. రాజు.

నీ ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు గుర్తు లేదు. నేను పంపించే కవరులో చాలా ఫోటోలు వున్నాయి. వాటిలో నీ ఫోటోలు ఏమయినా ఉంటే తీసుకొని మిగిలినవి తిరిగి పంపించు. దీంట్లో రిటన్ కవర్ కూడా పెడుతున్నాను.

భయం

రాజేశ్వర్: నాకు విమానం ఎక్కాలంటే చాలా భయం. అందుకని ఎక్కడికి వెళ్ళినా రైలులోనే వెళతాను.

వెంకటేష్: ఎందుకు?

రాజేశ్వర్: ఎప్పుడు  ఏ ప్రమాదం జరిగి కింద పడిపోతుందేమోనని.

వెంకటేష్: రైలు ప్రమాదాలు కూడా జరుగుతాయి కదా? మొన్న ఆ మధ్య ఒక రైలు ప్రమాదం జరిగి అయిదు వందల మంది చనిపోయారు.

రాజేశ్వర్: అయ్యో! ఆ ప్రమాదం ఎలా జరిగింది?

వెంకటేష్: విమానం రైలు మీద పడింది.

ప్రపంచం

ఒక పార్కులో ఇద్దరు ప్రేమికులు కూర్చున్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

రాణీ! నీ కళ్ళల్లో నాకు ప్రపంచం అంతా కనిపిస్తుంది. అన్నాడు రాంకీ.

వాళ్ళిద్దరినీ చాలాసేపటి నుంచి గమనిస్తున్న ఒక అగంతకుడు కంగారుగా వాళ్ళ దగ్గరకు వచ్చి బాబూ వారం రోజుల నుంచి నా కొడుకు కనిపించడం లేదు. కొంచెం వెతుక్కోనిస్తారా!

పదే పదే

బామ్మా! నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఈ రోజే జాయినవుతున్నాను. నన్ను ఆశీర్వదించు అంటూ బామ్మ కాళ్ళకు దణ్ణం పెట్టాడు సతీష్.

చాలా సంతోషం నాయనా! కానీ పదే పదే లీవ్ లెటర్‌లో నన్ను పదేపదే చంపొద్దు అంది బామ్మ.

ఎవరు కనుగొన్నారు?

టీచర్: సురేష్ ! మాప్ లో అమెరికా ఎక్కడ వుందో చెప్పు.

ఇక్కడ వుంది అంటూ మాప్ లో అమెరికా ఎక్కడ వుందో చూపించాడు సురేష్.

టీచర్: వెరీగుడ్! దినేష్ అమెరికాను ఎవరు కనుగొన్నారో నువ్వు చెప్పు.

దినేష్: సురేష్ సర్!

ఆఖరి కోరిక

మరణశిక్ష పడిన ముద్దాయిని ఎలక్ట్రికల్ చైర్ లో కూర్చోబెట్టారు. కరెంట్ షాక్ ఇవ్వబోతూ జడ్జి నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు.

కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు మీ చేయి పట్టుకోవాలని వుంది అన్నాడు ముద్దాయి.

చీమలు

అప్పారావు, పాపారావు మొదటిసారిగా విమానం ఎక్కి కూర్చున్నారు. అప్పారావు పాపారావుతో ఇలా అన్నాడు.

అప్పారావు: ఒరేయ్! విమానంలో నుంచి కిందకు చూస్తే  కింద వున్న మనుషులు చీమల్లా కనిపిస్తారు.

కిటికీలో నుంచి కిందకు చూశాడు పాపారావు. ఆ తర్వాత అప్పూ నిజంగానే నువ్వు చెప్పినట్టు మనుషులు చీమల్లా కనిపిస్తున్నారు.

అప్పారావు: నీ బొంద! అవి నిజంగా చీమలే. విమానం ఇంకా బయల్దేరలేదు!

డబ్బు

ఓ సిగరెట్ వుంటే ఇస్తావా? అని అడిగాడు అప్పారావు స్నేహితుడు కోటేశ్వర్‌ను.

ఇదిగో తీసుకో! అని మొత్తం సిగరెట్ పాకెట్ ఇచ్చేశాడు కోటేశ్వర్.

ఓ అగ్గిపుల్ల ఇస్తావా? మళ్ళీ అడిగాడు అప్పారావు. ఇదిగో తీసుకో! అంటూ లైటర్ ఇచ్చాడు కోటేశ్వర్.

అడిగిన వెంటనే లేదు అనకుండా అన్నీ ఇచ్చేస్తున్నావు. నువ్వు మళ్ళీ కొనుక్కోవాలి కదా! నీ దగ్గర చాలా డబ్బులు వున్నాయా? అడిగాడు అప్పారావు కుతూహలంగా. లేదు లంగ్ క్యాన్సర్ మాత్రం వుంది తాపీగా చెప్పాడు కోటేశ్వర్.

కొత్త సినిమా

నటి తారామణికి కొత్తగా పెళ్ళి అయింది. ఒకరోజు ప్రేమగా మాట్లాడుతున్న భార్యను అలాగే చూస్తూ కూర్చున్నాడు తారామణి భర్త.

అది చూసిన తారామణీ ఏమిటండీ అలా గుచ్చి గుచ్చి చూస్తున్నారు? అంది. ఏంలేదు నువ్వు రేపు నటించబోయే కొత్త సినిమా డైలాగులు చెబుతున్నావో, నిజంగా మాట్లాడుతున్నావో అర్థం కాక చూస్తున్నాను అన్నాడు సదరు భర్త.

పిచ్చివాడు

భార్య: ఏమండీ! నేను సడన్‌గా ఒకరోజు చచ్చిపోతే మీరు ఎలా బతుకుతారు? నాకు బెంగగా వుంది.

భర్త: అలా మాట్లాడకు నువ్వు లేకపోతే నేను పిచ్చివాడినైపోతాను.

భార్య: అయ్యో! అలాకావటానికి వీల్లేదు. మీరు మళ్ళీ పెళ్ళిచేసుకోవాలి. చేసుకుంటారు కదా!

భర్త: ఏమో తెలీదు! పిచ్చివాళ్ళు ఏదైనా చెయ్యవచ్చు.

సీట్లు

ఫర్నీచర్ షాపు ఓనరయిన ప్రకాశం తన కొడుకుని తీసుకొని ఒక స్కూలుకి వచ్చి ప్రిన్సిపాల్‌తో మా అబ్బాయిని మీ స్కూల్లో చేర్చాలనుకుంటూన్నాను. సీటు ఇవ్వండి. అన్నాడు.

మాస్కూల్లో సీట్లు ఖాళీలేవు. అన్నాడు ప్రిన్సిపాల్.

అయినా ఫర్వాలేదు. మా అబ్బాయి కూర్చునేందుకు కుర్చీ నేను తీసుకువచ్చి వేస్తాను అన్నాడు ప్రకాశం.

ఉరిశిక్ష

లాయర్: నువ్వు హత్య చేసిన వ్యక్తి నీకు ప్రాణదానం చేసిన వ్యక్తి కదా!

హంతకుడు: అవును

లాయర్: హత్య చేస్తే ఉరిశిక్ష పడుతుందని తెలుసా?

హంతకుడు: తెలుసు

లాయర్: మరి ఏందుకు హత్య చేశావు?

హంతకుడు: నెల రోజుల నుంచి ఆయన వైద్యానికి నా దగ్గర వున్న డబ్బు అంతా అయిపోయింది. డిశ్చార్జి అయి వచ్చేస్తుంటే, వెళ్ళిరండి అన్నారు. అందుకే!

అద్దె

సురేష్: అయిదేళ్ళ నుంచి నువ్వు ఇంత బాగా పనిచేస్తున్నా మీ బాస్ నీకు జీతం ఎందుకు పెంచలేదు.

రమేష్: ఏమో తెలీదు

సురేష్: నువ్వు ఎప్పుడూ అడగలేదా?

రమేష్: అడగలేదు

సురేష్: ఎందుకు?

రమేష్: నేను వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్నాను, జీతం పెంచమంటే అద్దె కూడా పెంచమంటారని.

సోమరి

అర్థరాత్రి ఇంట్లో చప్పుడు అవడంతో మెలకువ వచ్చింది పరంధామయ్యకు. బీరువా దగ్గర ఇద్దరు వ్యక్తులు కనిపించారు.

వాళ్ళు దొంగలని గుర్తించి పూర్తిగా కళ్ళు విప్పకుండానే, పట్టుకుపోయేవాళ్ళు ఎలాగూ పట్టుకు పోతున్నారు. మీరు తీసుకెళ్ళే వస్తువులు లిస్ట్ రాసి ఆ లిస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు పరంధామయ్య బద్దకంగా తిరిగి నిద్రకు ఉపక్రమిస్తూ.

నిలబడలేక!

గోపి: రాజా! భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది?

రాజా: దానికి కాళ్ళు లేవుకదా! ఒకచోట నిలబడలేక అలా తిరుగుతూ వుంటుంది.

ఎక్కడ?

అనసూయ: మా ఆయన ఏడాది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎక్కడ గడుపుతున్నారా? అనుకునేదాన్ని. చివరికి నిన్ననే తెలుసుకున్నాను.

సావిత్రి: ఎక్కడ గడుపుతున్నారేమిటి?

అనసూయ: నిన్న సాయంత్రం నేను క్లబ్‌కు వెళ్ళలేదు. ఆయన ఇంట్లోనే గడుపుతున్నారని తెలుసుకున్నాను.

[ వెనుకకు ]  [ ముందుకు ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 24-05-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in