telugudanam.co.in

      telugudanam.co.in

   

పిల్లల పాటలు (కొన్ని)

జుర్రే జుర్రే...

పొట్టేలు కన్నతల్లి గొర్రే గొర్రే

దున్నపోతు కన్నతల్లి బర్రే బర్రే



ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే

మిరపకాయ తింటే ఒర్రే ఒర్రే



కాకిరెట్ట బట్టమీద కర్రే కర్రే

బురదలోన కాలేస్తే పుర్రే పుర్రే



ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే

తొర్రి నోట్లో అంబలేస్తే జుర్రే జుర్రే


[ వెనుకకు ]


కుదురుగా పాపడు...

కుదురుగా పాపడు గుమ్మడికాయ

విరిసిన పాపడు విఘ్నేశాయ

సాగిన పాపడు సాంబశివాయ



చెలగిన పాపడు శ్రీకృష్ణాయ

అందెల పాపడు ఆంజనేయాయ

చెంగటి పాపడు శ్రీలోలాయ

జోలిన పాపడు జో సూర్యాయ



సందిట పాపడు సహచంద్రాయ

తారచు పాపడు తాతారాయ

బొజ్జన్న పాపడు పూర్ణబ్రహ్మాయ

ఆడిన పాపడు ఆనందాయ


[ వెనుకకు ]


చిట్టిపాప...

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి

సిగ్గుపడి జాబిల్లి పొడవుగా వెఱచు

పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే

పనసపండని జనులు పరుగులెత్తేరు



దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే

దోసపండని జనులు దోసిలొగ్గేరు

నీలాలు కెంపులూ నిలుపు వజ్రాలు

పగడాలు రత్నాలు పారిజాతాలు



పడలి మా అమ్మాయి పనిచేయు చోట

చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు

అందరికి మా అమ్మి అల్లారు ముద్దు


[ వెనుకకు ]


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి

భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి

అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి



పామల్లెపాకి కుందల్లె కూర్చుండి

నందల్లె నడిచి గుఱ్రమంత పరుగు

ఏనుగంత సత్తువు ఉండేటట్లు

సాకుమా బిడ్డను సంజీవరాయ


[ వెనుకకు ]


వదిన - మరదళ్ళ పాట - 1

వదినెను చూచితె కుదురుగున్నది

మొగము చూచితె ముద్దుగ నున్నది

గుణము చూచితె చెడ్డగనున్నది



కండ్లు చూచితె చక్కగనున్నది

ముక్కు చూచితె చక్కగనున్నది

దవడ చూచితె తళుకుగన్నది



చెవులు చూచెతె జ్యోతిగనున్నవి

భుజము చూచితె గజమున నున్నది

స్తనము చూచితె బలముగనున్నది



చేతులు చూచితె లేతగున్నవి

నడుము చూచితె పిడివలె నున్నది

కాళ్ళు చూచితే తాళ్ళుగ నున్నవి

గుణము కుదిరితె కూరిమి మీరును


[ వెనుకకు ]


వదిన - మరదళ్ళ పాట - 2

వదినా వదినా వల్లంకి పిట్ట

గంజి నీళ్ళోసి గదిలో పెట్టా

నీకు కొడుకు పుడితే నాపేరు పెట్టా

నీవలిగిపోతే మా అన్న కొట్టా



నే బతిమాల నువ్వేడవ నే నవ్వ

చింత చెట్టు మీద చిగురు

వాలుగొమ్మ మీద వగరు

అన్నయ్య బట్టలకు తొగరు



వదినెకు వచ్చింది పొగరు

పొద్దోయి పొద్దోయి అన్నయ్య వచ్చేను

జల్తారు చీరల్లు కట్టు వదినమ్మ

చుక్కలాంటి బొట్టు చక్కగా పెట్టమ్మ



చింతాకు రవికకు చీర చక్కన్న

చింతాకు రవికళ్ళు తొడుగు వదినమ్మ

వదినగారూ మీరు వాసిగలవారు

వండబోయిన చోట కుండనాకేరు


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: