|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పొడుపు కథలు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
అ నుంచి అః వరకు
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
ఆకాశం, చుక్కలు, సూర్యుడు
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
నక్షత్రాలు
అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
చందమామ
అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
సూర్యుడు
అక్కాచెల్లెలి అనుబంధం - ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
కళ్ళు
అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు, ఛాయ కాలనెమి ఛాయకడసారి తాతయ్య కణితి ఛాయ?
గురిగింజ
అబద్ధం అంటే తెలియని అమాయకురాలు
అద్దం
అబ్బాయి గారి దొడ్లో పెద్ద బొప్పాయి పండు పడితే పరుగెత్త లేక పదిమంది చచ్చారు.
పిడుగు
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటి కొచ్చింది తైతక్కలాడింది?
కవ్వం
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్నీ చెడతాగుతుంది.
గంధపుచెక్క
అడవిలో పుట్టాను, నల్లగామారాను, ఇంటికి వచ్చాను ఎర్రగామారాను, కుప్పలోపడ్డాను తెల్లగామారాను.
బొగ్గు
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటికొచ్చింది మహలక్ష్మిలా వుంది.
గడప
అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను. వంటినిండా గాయాలు, కడుపునిండా రాగాలు.
మురళి
అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది?
గజం బద్ద
అనంతపురంలో తప్పెట కొడితే అంతకు తగులు ఇంతకు తగులు చెరువులో ఉండే చేపకు తగులు బీళ్ళలో మేసే గొడ్డుకు తగులు బాలింతకు తగులు దీని భావమేమి?
మెరుపు
అన్నకందవు అమ్మ కందుతాయి.
పెదవులు
అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు.
అద్దం
అర చేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ
గోరింటాకు
అమ్మ కడుపున పుట్టాను. అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువున ఎండిపోయాను. నిప్పులు గుండు తొక్కాను. గుప్పెడ బూడిద అయినాను.
పిడక
అమారా దేశం నుంచి తుమారా పండ్లు తెస్తే కొనే వారే గాని తినేవారు లేరు.
పగడం
అలాము కొండకు సలాము కొట్టు.
గొడ్డలి
ఆకాశం పచ్చన నక్షత్రాలు తెల్లన
పచ్చిమిరపకాయలు
ఆకు పచ్చ హాస్పటల్, తెల్ల కాంపౌండరు నల్ల డాక్టరు నా పేరేమి?
సీతాఫలం
ఆకులేని చెట్టు అరవై ఆరు కాయలు కాస్తుంది.
నాగమల్లి
ఆడ గణ గణ ఈడ గణ గణ మద్దెమ్మ గుడి కాడ మరీ గణ గణ
డోలు
ఆ పక్క చూస్తే ఎర్ర టోపీ ఈ పక్క చుస్తే నల్ల టోపీ నేనెవరు?
గురిగింజ
ఆ రాజు కూతురు అధిక చక్కని దట గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది.
వరివెన్ను
ఆమడదూరం నుంచి అల్లుడొస్తే మంచంకింద ఇద్దరు గోడమూల ఒకరూ దాక్కున్నారు.
చెప్పుల జోడు,చేతికర్ర
ఇంటివెనుక వెంపలిచెట్టు ఏకాయ కాయమంటే, ఆ కాయ కాస్తుంది.
కుమ్మరిసారె
ఇంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు.
దీపం
ఇక ఇక కాయ పక పక కాయ నేల పోయే కాయ నెత్తి కెక్కే కాయ
ఈతకాయ
ఇక్కడ నుండి చూస్తే గుండు, గుండును కొడితే పండు, పండును కొడితే పదహారు వొప్పులు
తెల్ల పాయ
ఇక్కడ నుండి చూస్తే ఇనుముగా నుండు దగ్గరకు పోతే పండుగా నుండు తింటే తీపిగా నుండు
తాటి పండు
ఈడ ఢమ ఢమ ఆడ ఢమ ఢమ మద్ది రేవుల కాడ మరీ ఢమ ఢమ
ఉరుము
ఈనదు కట్టదు కడుపు నిండితే ప్రజల కింత ఫలమిచ్చు
చెరువు
ఈ ప్రపంచంలోని వారందరు నా బిడ్డలే. కాని అమ్మా! అని నన్నెవ్వరూ పిలువరు. ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నామీదే.
భూమి
ఎంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు?
మంగళ సూత్రం
ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు.
మిరపచెట్టు
ఎండకు ఎండదు వానకు తడవదు అది లేకపోతే జరగదు
రూపాయి బిళ్ళ
ఎందరు ఎక్కిన విరగని మంచం కదలదు జోగదు బెదరదు కూడ.
అరుగు
ఎర్ర మేడలో పచ్చ దీపాలు, దీపాలు చూదామని మేడ తలుపు తీసిన కళ్ళ వెంబడి నీరుకారు
పిచ్చిమిరప
ఎనిమిది చేతుల ఏబ్రాసీ ఎప్పుడు తిరిగే సోబ్రాసి వెన్నున జంజె వ్రెళ్ళాడు తీసిన కొద్ది తెర్లాడు.
రాట్నం
ఎప్పుడు ఒంటరిగా తిరుగుతాడు అందరికీ వెలుగునిస్తాడు.
సూర్యుడు
ఏటి నీటిన వెంపలి చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు.
పొగ
ఒంటి కంటివాడు ప్రాణం లేని వాడు ప్రతి సృష్టి చేస్తాడు.
కెమెరా
ఒక్క ఉద్యోగిపేరు నాల్గక్షరములు; మొదటి వర్ణము చెరపిన కదన మగును; మూడవది చెరుపగ హస్తమునకు చెల్లు; నట్టి ఉద్యోగి ఎవ్వడో అరచి చెప్పుడు.
కరణం
ఒహొహొ బాలయ్యా ఒళ్ళంతా ముళ్ళయ్య పరపరకోసేస్తే కడుపంతా తీపయ్య.
పనసకాయ
సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in