|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పొడుపు కథలు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
య నుంచి ఱ వరకు
యంత్రము గాని యంత్రమును నేను! నాకు అప్పుడపుడు రిపేర్లుంటాయి. ఒక్కసారి ఆగిపోయానంటే, నేను మరలా పనికి రాను. మరి నే నెవరిని?
మనిషి
యమునికైనా భయపడను! కొట్టినా ఏడవను! తిట్టినా బాధ పడను! మీరేమనుకున్న నేనేమనుకోను. మరి నేనెవరిని?
బొమ్మ
యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీకగపడదు.
బొట్టు
రచ్చబండ క్రింద నలుగురు దొంగలు?
గేదెపొదుగు
రణం కాని రణం ?
మరణం,తోరణం,ఆభరణం
రసం కాని రసం?
నీరసం, సరసం, విరసం
రాజ మందిరము చిన్నదానా! రాఘవయ్య కోడలా! చేద వెయ్యకుండా, తియ్యకుండా, దాహమునకు నీరు తేవె!
కొబ్బరి నీరు
రాజా వారి తోటలో రోజా పూలు! చూచే వారే గాని, కోసే వారు లేరు. ఏమిటవి?
నక్షత్రములు
రాయి గాని రాయి! ఏమి రాయి?
పావురాయి
రేయీ, పగలూ నడిచింది. చేయీ, చేయీ కదిలింది. వేళా, పాళా చెపుతుంది. వున్నచోటనే పడివుంది.
గోడ గడియారము
రోషమునకు మారు పేరు నేను! భీముడను మాత్రము కాను. అందుకే ఎవరికి రోషము వచ్చినా, ముందు నా మీదే చెయ్యి వేస్తారు. నే నెవరిని?
మీసము
లంక తగుల బెడితే, లచ్చి మొత్తుకునే!
అన్నము ఉడుకుట
లక్కబుడ్డి నిండా, లక్ష వరహాలు?
పుచ్చకాయ
లక్కపిడతలో, లక్ష వరహాలు!
దానిమ్మపండు
లాగి విడిస్తేనే బ్రతుకు?
ఊపిరి
లింగడు కన్నెమనసు, దొంగిలించిన దొంగాడు?
మన్మధుడు
లోకమంతా చాప వేసి, నిద్ర పోకుండా తిరుగుతూ వుంటాడు.ఎవరతను?
సముద్రము
లోతు బావిలో జారికి బెల్లం?
గుబిలి
లోన బంగారము! బయట వెండి! ఏమిటి?
కోడి గ్రుడ్డు
వంకర టింకర మ్రాను! కష్ట జీవుల గూడే ఈడు, జోడు! విప్పితే, ఇంకో ఇల్లుంది. ఏమిటది?
పెండ్లి పల్లకి
వచ్చి పోయేవి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
కలిమి, లేములు - మాన, ప్రాణములు
'వరి' గాని వరి! ఏమి వరి?
జనవరి
వళ్ళంతా ముళ్ళు. వాసన ఘుమఘుమ?
గులాబి
వస్తూకేక లేస్తుండు! వేస్తూ పోతుండు! ఎవరు?
గాజులసెట్టి
వస్తే పోనివి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
కీర్తి, అపకీర్తి - పరువు, ప్రతిష్ట
వాకిట్లో కలవారి కోడలు పడింది?
ముగ్గు
వాయు వేగమును మించి, లోకములన్నీగాలించి, చిటెకెలోఉన్న చోటికి వచ్చు! ఏమిటది?
మనసు
'వారు' గాని వారు! ఏమి వారు?
నవారు, అయ్యవారు
'వాలు' గాని వాలు! ఏమి వాలు?
ఆనవాలు, ఆవాలు
విత్తనము లేకుండా, మొలిచేది ఏమిటి?
గడ్డము
విశ్వాసమునకు ప్రతినిధిని నేను! విశ్వాసహీనుని చూచి, ' నీకంటే అదే నయమని' అంటారు. మరి నేనెవరిని?
కుక్క
వేలెడంత లోగిలిలో, ఏభైమంది నివాసము!
అగ్గి పెట్టెలోని పుల్లలు
వేసిన దేమిరా? వ్రేలు పెట్టి చూసిన దేమిరా?
వేసినది చెక్కరా! వ్రేలుపెట్టి వాసన చూచినది శ్రీ గంధమురా
వేస్తే సోకు! తీస్తే బోసి! ఏమిటి?
కండువ
శంఖులో పెంకు, పెంకులోతీర్థము, తీర్థములో మొగ్గ?
టెంకాయ
శాఖలు ఉన్నా, ఆకులు లేనిది?
సంస్థ
శిబి, కర్ణులార్జించిన చెలువ ఏది?
కీర్తి
శివరాత్రికి చంకలెత్తనీయుడు?
చలి
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?
మామిడికాయ
శ్రీ రాముడు కూడ పట్టి వంచలేనిది, రంగు రంగులుగా ఒకే వరుసలో వచ్చునది, 'కుక్కకు, నక్కకు పెళ్ళి'అనే సమయములో వచ్చునది. అదేమటో విప్పగలరా?
ఇంద్ర ధనస్సు
శ్రీ రాముల ఇంటి వెనుక శ్రీవణము చెట్టు! కాస్తుంది, పూస్తుంది. వాసన వుండదు.
చింతకాయ
శ్రీ విష్ణువు మోయుచు తిరిగెడు పక్షి?
గరుడ పక్షి
సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగరాయుడు, గట్టుమీద గంగారాయుడు!
త్రాసు, కలము, కొంగ
సందకాడ లగ్గమాయె! కాని పొత్తు గర్భమాయె! కోడి కూతకు కొడుకు పుట్టె! పొద్దు పొడవ పేరు కొచ్చె!
చల్లకుండ
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి అరిచేది?
శంఖం
సముద్రంలో మునుగునది కానీ, చేపకాదు ఏమిటది?
నది
సల సలా కాగే నీళ్ళలో సీతమ్మ స్నానమాడు.
అరిసెలు
సాయి గాని సాయి! ఏమి సాయి?
కసాయి
సార సారల చెంబు, చక్కని చెంబు ముంచితే మునగదు ముత్యాల చెంబు?
దోసకాయ
సావిట్లో సద్దు కర్ర ?
కలం
సీమంత ముండ బిడ్డ అందరికీ వడ్డించు!
గరిటె
సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది.
మొగలి పూవు
సూది వెళ్ళి చుక్కలను తాకింది. ఏమిటి?
తారాజువ్వ
సూర్యుడు చూడని మడుగు! చాకలి తాకని గంగ!
టెంకాయ
హంస ముక్కుకి, ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు త్రాగుతుంది?
ప్రమిద
హద్దులేని పద్దు?
అబద్దం
హనుమంతుడు అందగాడు?
బ్రహ్మచారి
హనుమంతుని పెళ్ళాం గొప్పధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవాల్చు?
కొర్రకంకి
హరీ అనకుండానే చచ్చేది?
చెట్టు
హర్మోనియంకూ, నాకూ తేడా ఉండదు. అది శబ్దము చేస్తుంది. నేనునూ శబ్దము చేస్తాను. దాని ఫలితము అశాశ్వతము! నా ఫలితము శాశ్వతము! మరి నేనెవరిని?
టైప్ రైటర్
హారము గాని హారము! ఏమి హారము?
ఆహారము
క్ష కారము చివరి స్థానము! క కారము మొదటి స్థానము! మరి నేనెవరిని?
కక్ష
క్షమించుట తప్ప, నాకేమీ తెలియదు. మరి నేనెవరిని?
జ్ఞాని
సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in