www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

మనసు మూలాల్లోకి...

'ఎం.జె.ధన్' అది అక్కడి పేరు. మనకు మేడిచర్ల జగన్నాధం భారతదేశంలో అందులోనూ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన ఆంధ్రదేశంలో ఓ పల్లెటూరిలో పుట్టి, డాక్టరుగా ఎదిగిన జగన్నాధం... ముప్పై సంవత్సరాలకు పైబడి మక్కువతో అక్కున చేర్చుకున్న వైద్యవృత్తి కోసం దేశాన్ని, ఊరును వదిలి, తన వైద్య ప్రస్థానంలో జిల్లా రాజధాని నుండి రాష్ట్ర రాజధాని మీదుగా దేశ రాజధానికి ఎదిగి.. ఇంతింతై ఎదిగిన వాడు జగన్నాధం. పేరొందిన డాక్టరై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లను సందర్శించి చివరకు డాక్టర్ ఎం.జె.ధన్ గా లండన్‌లో స్థిరపడ్డాడు.

ఓ రకమైన వేగవంతమైన జీవితానికి అలవాటు పడ్డ జగన్నాధం, అక్కడి సంస్కృతిలోని వాడినీ, వేగాన్నీ బాగానే ఒంట పట్టించుకున్నాడని చెప్పొచ్చు. డాక్టర్‌గా ఓ విధమైన యాంత్రిక జీవితంలో బాగానే ఒదిగిపోయాడు. జనరల్ సర్జన్‌గా రోగులకు తన వంతు సేవ చేస్తూ మంచి డాక్టరుగా పేరు సంపాదించాడు. చొచ్చుకుపోయే నైజం గల జగన్నాధం, లండన్‌లో ఈనాడు ఓ పేరు మోసిన సర్జన్.

ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇండియాకు, అదీ తనను పెంచి పెద్ద జేసిన మేనమావ చనిపోతే చూడడానికి, బయలుదేరాడు. ఏళ్ళు గతించినా ఇండియాను, అక్కడి నిర్వాకాలను బాగానే గమనిస్తున్నాడు.

అందుకే ఇండియా వస్తూంటే తన యాంత్రిక జీవనశైలికీ, ఇక్కడి విధానాలకూ మధ్య వైరుధ్యాలను అంచనా వేసుకో సాగాడు. కానీ తన ఆలోచనల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోందిక్కడ. ఆ నాటికీ, ఇప్పుడూ ఎంతో తేడా అగుపిస్తోంది.

కొన్ని ప్రాంతాలు తిరిగి చూశాడు. ఎప్పటికీ ఇది అభివృద్ధి చెందదు అనుకొనే రెండు వందల గడప ఉన్న చిన్న పల్లెటూరు రోడ్ల మీద కూడా ఈనాడు బెంజికార్లు, హోండా మోటర్స్ పరుగులు తీస్తున్నాయి. కంప్యూటర్స్, ఇంటర్‌నెట్, మైక్రో ఓవెన్స్, బ్రాందీ షాపులు... చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్నాధానికి.

ఇండియా వెనకబడి లేదు... ఎంతో పెరిగిపోతోంది.

ఇక్కడ దొరకదని తన కిష్టమైన ఫారిన్ విస్కీ తనతోనే తెచ్చుకున్నాడు. తెచ్చిన అరడజను ఫుల్ బాటిల్స్ అయిపోతే... తిరిగి వెళ్ళేవరకు తన స్థితి ఏమిటి? ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు.

దొరికిన లోకల్‌బ్రాండ్‌తో అడ్జస్ట్ అవడం తప్ప గత్యంతరం లేదు అనిపించింది. 'అరుదుగా ఫారిన్‌లో దొరికే విస్కీ ఈ చిన్న ఊరిలో దొరుకుతుందని ఊహించలేదు చిట్టీ! చాల వేగవంతమైన మార్పు!'  సూర్యుడు అస్తమించి ఎర్రబారిన ఆకాశం కింద కొబ్బరి నీళ్ళతో కలిపిన విస్కీని చప్పరిస్తూ అన్నాడు జగన్నాధం.

'ప్రపంచీకరణ లోకాన్ని చిన్ని గ్రామంగా చుట్టి పడేసినప్పుడు అన్నీ అన్ని చోట్లా దొరుకుతున్నాయి.' ఖాళీ అయిన గ్లాసుల్లో విస్కీ ఒంపుతూ అన్నాడు చిట్టినాయుడు.

చిట్టినాయుడు జగన్నాధానికి చిన్ననాటి స్నేహితుడు.

'మరి సూరీడు?' క్రమంగా కనుమరుగవుతున్న వెలుతురు చూస్తూ పలికాడు.

 'అదే మన సంపద!! ఒకింత గర్వం కన్పిస్తోంది చిట్టినాయుడు గొంతులో. 'వరదల అతివృష్టి, కరువు, అనావృష్టిల మధ్య ఊగిసలాట... బట్ ఇండియా ఇండియానే ' పల్చటి సూర్యకిరణాలు కళ్ళను తాకి కవ్విస్తుంటే అన్నాడు.

అవును... అన్నిచోట్లా దొరుకుతాయన్న చిట్టినాయుడు స్టేట్‌మెంట్‌కి సూర్య భగవానుడు మినహాయింపు. రోజంతా లోకాన వెలుతురు నింపినవాడు, కొన్ని క్షణాలలో కనుమరుగు కాబోతున్నాడు. మనిషి జీవితం కూడా అంతేనేమో! ఉద్యోగధర్మమంటూ ఊరూరూ, దేశ దేశం తిరిగాను. డెబ్భై సంవత్సరాల జీవితం ఎప్పటికైనా అంతమవలసిన బ్రతుకు... శ్వాసకూ, నిశ్వాసకూ మధ్య నెలకొన్న ఆ లిప్తకాలంలో వీడు ఎం.జె.ధన్ కాదు, స్వచ్చమైన మేడిచర్ల జగన్నాధం అన్పించుకోవాలని ఉందిరా!

రెండో రౌండ్‌ పడేసరికి మాట తీరు మారిన జగన్నాధాన్ని చూసి నవ్వుకున్నాడు చిట్టినాయుడు. వీడు అవడం పెద్ద సర్జను. కాని ఒట్టి బోళా మనిషి. 'నువ్వు ఇండియాకి వచ్చి స్థిరపడతానంటే నమ్మకం లేదు నాకు.'

'అవును. నా కొడుకు ఈనాడు నన్ను మించిన డాక్టరు. అన్నీ వాడికి అప్పగించి వేగవంతమైన యాంత్రికజీవితం నుండి నిష్క్రమించాలని నా కోరిక. ప్రశాంతంగా నిష్కర్షగా కన్న దేశంలో బ్రతుకు మూలాల్లోకి వెళ్దామని, ఒకనాటి జగన్నాధంగా బ్రతకాలని.'

 ఆయనలోని మారుమనిషి మాట్లాడుతున్నాడులా ఉంది. వింతగా చూస్తున్నాడు చిట్టినాయుడు.

'ఇండియాలో ప్రశాంతత ఏమిటి నాన్నా? తాత లేడు, బామ్మ లేదు, నీ అనుకునేవారు ఎవరూ లేరు. ఇండియా ఈజ్ నధింగ్ బట్ ఎ పూర్ కంట్రీ. ఈ సుఖవంతమైన జీవితం వదులుకొని అక్కడ ఇమడలేవు. మూడు సంవత్సరాల క్రితం మన దేశం నుండి వచ్చినవారే ఇక్కడ స్థిరపడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా కొడుకు అలా అంటూంటే నాలో ఏదో తెలియని వెలితి. ఆ వెలితిలో కూడా వాడు 'మనదేశం' అనడం సంతాషాన్ని ఇచ్చింది.' జగన్నాధం మాటలు చాలా హృద్యంగా అన్పిస్తున్నాయి చిట్టినాయుడికి.

'కానీ నువ్వు కోరుకుంటున్న ప్రశాంతత. నువ్వూహించిన మనుషులు, నీ పదేళ్ళ వయసు నాటిజీవితం అనుభవించిన మాధుర్యం అక్కడ లేదిప్పుడు. ఉన్నదల్లా మనుషుల మధ్య అభద్రతాభావం, అస్థిరత, ఆధిపత్యపు పోరులు...' కొడుకు అన్న మాటల్ని చెప్పుకుపోతున్నాడు.

జగన్నాధం మాటలు ఆలోచనల్లో పడేస్తున్నాయి చిట్టినాయుడిని.

'అవును చిట్టీ! వందేళ్ళు బ్రతికిన మేనమావా పోయాడు. నాకంటూ ఇక ఎవరిక్కడ? అయినా నా మాతృదేశంలో... నాదైన జీవితాన్ని నేను కోరుకుంటున్న మాధుర్యాన్ని..'

'మనసు స్థిరపరచుకుంటే ఆ మాధుర్యం అక్కడా దొరుకుతుంది.'

'అది కాదురా చిట్టీ!'

'చూడు జగ్గీ! నీకు జన్మనిచ్చిన ఊరు విశాఖ స్టీల్ ప్లాంట్ ధర్మమా అంటూ కనుమరుగైపోయింది. ఇక నీకిక్కడ జ్ఞాపకం అంటూ ఏదైనా మిగిలి ఉందంటే నమ్మను. అయినా కొన్ని కొన్ని చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి. దాంట్లో ఇదొకటి.'

'మనకంటూ ఒకటి లేనప్పుడు... మరొకటి దత్తత తీసుకోవడం తప్పుకాదంటా!'

'వంశం కోసం దత్తత కొడుకులా?' చిట్టినాయుడు పకపకా నవ్వాడు.

'......................'

'అంటే ఏదైనా చేస్తావన్నమాట!'

 'ఎస్... నిరాదరణకు గురై ఎందుకూ కొరగాని ఊరులో కరెంటు రోడ్లు కమ్యూనికేషన్స్ మంచి కాలక్షేపానికి అవకాశాన్ని ఏర్పరచాలని, ఖర్చు ఎంత అయినా కొంత నాది మిగతా నా ఇన్‌ఫ్లూయన్స్‌ది.'

జగన్నాధం ముఖంలోకి చూశాడు. ఐదో రౌడ్ అయిపోయింది. మాటలు పీక్‌లో ఉన్నాయి. చిన్నగా నవ్వుకున్నాడు నాయుడు. మతాబుకి ముసురు తగిలింది మంద్రంగా మత్తుగా ఉన్నాయి ఆ మాటలు.

ఇండియాకొచ్చిన తర్వాత నాకెందుకో దిగులుగా ఉంది చిట్టీ! చాల చిన్నతనంలో వదిలిపోయిన ఆ ఊరు, నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. వాస్తవానికి ఆ ఊరు పారిశ్రామికీకరణ నేపధ్యంలో కరిగి పోయింది. ఇంకా చెప్పాలంటే కఠినమైన ఉక్కు దిమ్మెల కింద సమాధి అయింది. ఒక విధంగా లండన్ మిస్సవుతున్నాననే ఫీలింగ్ ఉంది. అయినా నే చూడాలనుకున్న ఇండియా ఇది కాదు. ఇక్కడ మనుషులు వారిమధ్య మునుపటి ఆప్యాయతలు, అవి కనుమరుగవుతున్న తీరు దిగ్బ్రాంతిగా ఉంది. మతాల నడుమ మానవీయత దెబ్బ తినడం, వ్యక్తుల ద్వేషాల్ని మతాలకు ముడిపెట్టడం. ప్చ్! లండన్‌కూ ఇండియాకు తేడా లేనప్పుడు, ఇట్స్ బెటర్ టు స్టే ఇన్ లండన్!, జగన్నాధం మాటలలోని నిజాయితీ, కంఠంలో స్పష్టంగా వినిపిస్తుంది.

'రాత్రి మందులోను, ఇప్పుడూ నీ ఉద్దేశ్యంలో ఏ మార్పూ లేదు!' అనురాగమయంగా అన్నాడు చిట్టినాయుడు.

'......................'

'నీకళ్ళలో మెదులుతున్న ఊరును చూడాలనుందా?'

'ఐ లవ్ ఇట్... ఎస్... ఐ వాంట్ టు సీ!' వాలు కుర్చీలో కూర్చున్న జగన్నాధం నిటారై అన్నాడు.

'సమ్‌వేర్ ఇన్ ద స్టాండ్స్ ఆఫ్ గోదావరి, దేరీజ్ ఎ విలేజ్. మైండ్ ఇట్! దేర్ వజ్ నాట్, దేరీజ్ సీ ఇట్'.

'డెఫినెట్లీ యు ఫీల్ సమ్ మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. దటీజ్ వేండ్ర..'

'ప్రపంచం అంతా మూవ్ అవుతోంది. ఈ వేండ్ర ప్రత్యేకత ఏమిటి?' అర్థం కాక నాయుడి కళ్ళలోకి చూశాడు.

గోస్తనీ నది మీద బల్లకట్టు దాటడం బాగుంది జగన్నాథానికి. ఎప్పుడో చిన్నప్పుడు తాతగారి ఊరు అగ్రహారం వెళుతుండేటప్పుడు దాటిన గుర్తు.

'ఈ రోజుల్లో ఇంకా బల్లకట్టు!'

'ఇదే కాదు, ఊరికి అవతల మరో కాలువ. దాని మీద మరో బల్లకట్టు'

అంటే ఈ ద్వీపానికి చెక్కపంటిల బాధను తప్పించాలి ముందు. పెరుగుతున్న ప్రపంచానికి దూరంగా అంటరాని ఊరుగా మిగిలిపోవడం వింతగా ఉంది.

'ఈ ఊరిని ఎవరూ పట్టించుకున్నట్లు లేదు, కూలిపోయిన కర్రల వంతెనను అడ్డుకొని నీటి ప్రవాహానికి అంతరాయం కల్గిస్తున్న తూటి మొక్కల్ని చూస్తూ అన్నాడు జగన్నాథం.

బల్లకట్టు జగన్నాథానికి వింతగానూ, కొత్తగానూ ఉంది. ఆ క్షణాన తానో పేరు మోసిన డాక్టరునన్న సంగతి మరచిపోయాడు.

అవతలగట్టు మీద ఖరీదైన శాంత్రో కారును పార్కు చేసి వచ్చిన కొత్త మనుషుల్ని వింతగా చూస్తున్నారు అక్కడివాళ్ళు.

బల్లకట్టు గెంటుతూన్న గుర్రం తాత చేతిలో పదిరూపాయలు పెట్టాడు.

'అస్లాం భయ్యా! కొత్త దొరలు. ఎక్కడికో తెల్సుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లు.' ఇచ్చిన నోటుని పంచె బొడ్లో దోపుకుంటూ అన్నాడు గుర్రం తాత.

రోడ్డు మీద మట్టి కొంచెం గాలికే ఎగిరిపోతోంది. అక్కడక్కడ కొంచెం కొంచెంగా పరిచిన ఎర్రకంకర, నల్లమట్టికి భిన్నంగా కన్పిస్తోంది. అస్లాం వెంట నడుస్తున్నారు ఇద్దరూ.

'ఈయన జగన్నాథం గారని లండన్‌లో పెద్ద డాక్టరు! మీ ఊరు చూసి పోదామని వచ్చారు. పనిలో పనిగా గ్రామ ప్రెసిడెంట్ గారితో మాట్లాడదామని.' వచ్చిన రెండు నిమిషాలకే ఆ యువకుడు చిట్టినాయుడికి పరిచయమయ్యాడు.

'ఈ ఊరు ఇంతేనా?'

'అవున్సార్! రెండు వైపులా వేండ్రను కావలించుకున్న గోస్తనీ నది... అటూ ఇటూ బల్లకట్టు, అతిపురాతనమైన రామలింగేశ్వరుడు, గోపాలస్వామి దేవాలయాలు వందేళ్ళ నాటి అతి పెద్ద మర్రిచెట్టు. నిజం చెప్పాలంటే వేండ్రను తల్చుకుంటే వేదం గుర్తుకు వస్తుంది... ఎదిగిన ఊరు!'

ఒక ముస్లిం యువకుడు వేదం గురించి ఉద్వేగంగా చెప్పడం చాలా బాగుంది. అతను 'ఎదిగిన ఊరు' అనడం అర్థం కావడం లేదు. చూస్తే సదుపాయాలు ఏమీ అంతగా లేని చిన్న ఊరు.

'నేనూ ప్రెసిడెంట్ ఉస్మాన్ గారింటికే!' అతన్ని అనుసరించారు. ఊరి మధ్య అగుపిస్తుంది పెద్ద మర్రిచెట్టు. వంద సంవత్సరాలు పైబడి శాఖోపశాఖల్ని ఊడల్ని విస్తరించుకొని ఉంది. కొన్ని శాఖలు ఎండిపోతూ ఉన్నా చరిత్రకు సజీవచిహ్నంగా అగుపిస్తూ ఉన్నాయి. దాని మీద మటుకు ఎంతో దూరం విస్తరించి ఉంది.

ఊరు గురించి అతని మాటల ద్వారా కించెం అర్థం అవుతోంది.

అక్కడ ఉన్నవి పదికి మించని సాయిబుల ఇళ్లు. ఐదారు క్రిష్టియన్ కుటుంబాలు. మిగతా అందరూ హిందువులే! అయినా ఓ మైనారిటీ ఊరుకు ప్రెసిడెంట్‌గా ఉండటం ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకు. పదవికి రిజర్వేషన్ ఏదైనా ఉందా అంటే అదీ లేదు.

ప్రెసిడెంట్ ఉస్మాన్ గారికి వాళ్ళను పరిచయం చేశాడు ఆ యువకుడు. ఆ ఊరి పెద్ద మాటలు ప్రభావితం చేస్తున్నాయి జగన్నాథాన్ని.

'ఓ సారి పక్క వూరు అత్తిలి వెళ్ళాను. అక్కడ మసీదులోని వ్యక్తి నువ్వేదో మీ వేండ్ర గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. పంచాయితీ ప్రెసిడెంట్ పెత్తనం ఇచ్చారే గాని డెసిషన్ మేకింగ్ అంతా వాళ్ళదే! రబ్రీ దేవి ముఖ్యమంత్రి మాత్రమే. కానీ బీహార్‌లో పాలక పగ్గాలు లాలూప్రసాద్ యాదవ్ చేపట్టే వాడు.'

'నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్! నీకు తెల్సింది ఒకే ప్రపంచం. ఆ ప్రపంచానికి మా ఊరు తద్బిన్నం. డెసిషన్స్ ఎన్ని తీసుకున్నా తుది మాట నాదే! నా మాటకు అంత వేల్యూ ఇస్తారు మా ఊరిలో పెద్దలు. ప్రపంచాన్ని పాజిటివ్‌గా చూడటం నేర్చుకో. మన అల్లా అదే చెప్పాడు.'

ప్రెసిడెంట్‌గా ఉస్మాన్‌ను ఎందుకు ఎంపిక చేశారో, ఆయన మంచితనం చూస్తేనే అర్థమవుతోంది జగన్నాథానికి.

'మనది మెజారిటీ. పంచాయితీ ఆధిపత్యం మనకొద్దు. ప్రెసిడెంట్ మైనారిటీకి ఇవ్వడం ధర్మం. అప్పుడే అతనికుండే ఆర్ధికవనరులు ఇబ్బందులు బయటి ప్రపంచానికి చక్కగా ఫోకస్ చేయగలడు.' వారి మాటల్ని చెబుతున్నాడు అస్లాం.

ఈయన డాబా పోలు. చిన్నపాటి రైతు. ప్రెసిడెంట్ పరిచయం చేసిన వ్యక్తితో చేయి కలిపాడు జగన్నాథం.

'డిసెంబరు ఆరున జరిగిన బాబ్రీమసీదు దుర్ఘటనని మిగతా మతస్థులు బ్లాక్‌డేగా పాటించాం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వేసిన శిలాఫలకం ఇది' చూపిస్తూ అన్నాడు పౌలు.

'మన వాళ్లు చేసిన ఈ పనికి సిగ్గుతో తలదించుకుంటున్నాం.' జమ్మి చెట్టు వీధిలో నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న బొడ్డు రాయికి పక్కగా ఉన్న శిలాఫలకాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు జగన్నాథం.

'అలాగే ఒరిస్సాలో ఫాదర్ స్టెయిన్‌ని హత్యచేసిన రోజునూ బ్లాక్ డేగా పరిగణిస్తారు.' పౌలు మాటలలో ఉద్వేగం ఉంది. సెక్యులరిజానికి సిసలైన చిరునామా కన్పిస్తోంది అక్కడ.

ఆరువేల మాణిక్యం వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మూడు వందల గడప ఉన్న ఊరులో మతాలకు అతీతంగా అందరూ అన్నీ కట్టించారు. ఓ మసీదు...  ఐదు కుటుంబాలు మాత్రమే ఉన్న క్రిష్టియన్లకి చర్చి. ఓ దేవాలయం నిర్మాణాలలో అందరి చందాలు ఉన్నాయి.

'విశేషమేమిటంటే ఈ ఊరులో పోలీస్ స్టేషన్ లేదు. కోర్టులూ లేవు. దే డూ దెయిర్ ఓన్ జస్టిస్. ఇప్పటికీ  ఇక్కడ రేడియో తప్పితే టీవీ లేదు.' చుండూరు వీరయ్య గారనే టీచరు చెబుతున్నాడు.

ఏమి జరిగినా వెళ్ళి వాళ్ల  కష్టసుఖాలను పంచుకోవడం ఊరిని గురించి ఉమ్మడి అవగాహన కట్టుబాట్లు, సంప్రదాయం, గౌరవం పట్ల అందరికీ అవగాహన ఉంది.' పెంకుటింటి రామన్న అన్న భూస్వామి చెప్పుకుపోతున్నాడు.

'సర్వ మతాలు ఇక్కడ గౌరవింపబడుతున్నాయి. ఊరిలోని వారికి సరుకులు కావాలంటే ఎడ్ల బండి మీద పోయి అన్నీ కట్టించుకుని తెచ్చి అందరికీ పంచుతాము.' ఆ వీధి కనకయ్య అనే ముసలాయన ఉద్వేగంగా వివరించి చెబుతున్నాడు.

అలా మాట్లాడుతున్న వారి వారి ముఖాలలో, వేండ్ర పట్ల ఓ రకమైన మంచి అనుభూతి కనిపిస్తోంది జగన్నాథం, చిట్టినాయుడులకు.

'ఒకసారి ఒకతను టీవీ తీసుకుని వస్తే అన్ని కులాలవాళ్లు, అతని కన్నవాళ్లతో సహా కాదు పొమ్మన్నారు. అలాగే కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌లు విచ్చలవిడి సంస్కృతి కాదనుకున్నాం అంతే!' శనివారపు సత్యం గారనే స్వాతంత్ర్యసమరయోధుడు గర్వంగా చెప్పుకుపోతున్నాడు.

ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో నదులు, కాల్వలు పొంగి ప్రవహించడం, ఇక్కడ సర్వసాధారణం. ఇతర గ్రామాలు, పట్టణాలు ముంపుకు గురవుతుంటాయి. వేండ్ర మటుకు ఎప్పుడూ మునిగిపోలేదు.

'గంగమ్మకు అందనంత ఎత్తులో ఉండటం ఓ కారణం కావచ్చు. తమ గ్రామాలకు వరద నీరు ముంచెత్తిన ప్రతి సారీ పక్క ప్రాంతాలవారు వచ్చి ఇక్కడ తలదాచుకున్న సంఘటనలు కోకొల్లలు. విశేషమేమిటంటే ప్రపంచం మొత్తం కరవుతో అల్లాడినా ఈ ఊరెప్పుడూ సస్య శ్యామలమే! ఇరువైపుల నుండీ కావలించుకున్న నదులు రెండూ ఎండి పోవు. ఊరి పచ్చదనాన్ని వాడనివ్వవు! వేణుగోపాలస్వామి దేవాలయార్చకుడు దేవుడు వెంకటాచార్యులు ఏకరువు పెడూతూంటే జగన్నాధం, చిట్టినాయుడులలో తెలియని ఉల్లాసం పెల్లుబుకుతోంది.

'పంచాయితీ ఎలక్షన్లు అన్నీ ఉన్నాయి. కాని ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. ఏ మతమైనా ఏకగ్రీవమే. పంచాయితీ ఐదుగురుసభ్యులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అదెప్పుడూ ఏక పక్షంగా ఉండదు. సర్పంచ్ ఉస్మాన్ విపులంగా వివరిస్తున్నాడు.

జగన్నాధానికి ఆ ఊరు వాతావరణాన్ని చూస్తూంటే హృదయం అనుభూతుల పరపరలతో మమేకవౌతోంది. వారివారి మాటలు ఆ ఊరిలో స్పష్టంగా చూసిన ప్రతిచోట నిజమని చెప్తున్నాయి.

ప్రపంచీకరణ నేపధ్యంలో పల్లె ప్రాంతాల సైతం రూపురేఖలు మారిపోతున్న కాలంలో, వాడవాడలా అరాచకాలు వర్ధిల్లుతూన్న కాలంలో, కుమ్మరి, కమ్మరి, చేనేత, తదితర కుల వృత్తులన్నీ అవసానదశకు చేరుకొని పల్లె సౌందర్యాన్ని విఛ్చిన్నం చేస్తున్న కాలంలో దౌర్జన్యంగా, గుండాగిరిల పునాదుల మీద మనగల్గుతూన్న రోజుల్లో, మూలాలు అంతమైన సంస్కృతి ఛిద్రమై, సాంప్రదాయిక జీవితాలకు కొత్త అర్ధాలు వెదుకుతున్న వేళ, ఇంకా ఇటువంటి ఊరు.

 తాతయ్య చెప్పిన కథలలోని పల్లెను చూస్తున్నాడిప్పుడు కొత్తదనాన్ని లేని ఊరు ఇక్కడ పవిత్రత ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మొలిచిన మర్రిచెట్టు పెరిగి తన నీడలో విస్తృతపరచడం బాగుంది.

చాలా చోట్ల ఎక్కడా కనిపించని పిచ్చుక జాతి కుడా కిలకిల రావాలతో ఆ చెట్టు కొమ్మల నడుమ పరిగల్ని తింటూ విశ్రాంతిగా సేదతీరగలుగుతోంది.

పై చదువులు చదువుకొని ఉద్యోగాలొచ్చి వెళ్లిపోయారు చాలా మంది. ఆ ఊరి పొలిమేర కావల ఓ పెద్ద ఎగ్జిగ్యూటివ్ ఆఫీసరు కావచ్చు. కాలువ దాటి ఆ చెట్టు నీడకు రాగానే ఆ స్థితి అప్రమత్తంగానే నిలుస్తాయి. ఊరంతా ఐక్యమత్యంగా మమేకమై ఉంటోంది.

నాగరికత ఛాయలు ఆ ఊరికి రాలేదు. నాగరికత నేర్చిన మేధావులకన్నా అందనంత ఎత్తులో ఉన్నారు వేండ్ర ప్రజలు.

ఇండియాకి వచ్చినప్పుడు తాజ్‌మహల్ చూడాలనుకున్నాడు. హైదరాబాద్‌లో చార్మినార్, తిరుపతిలో ఏడుకొండలస్వామిని చూడలనుకున్నాడు జగన్నాథం???

'ఈ ఊరిని దత్తత తీసకుని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఐ మీన్, ముఖ్యంగా కాలువల మీద వంతెనలు, మంచి రోడ్లు, రవాణా సౌకర్యం, ఇతర సదుపాయాలు. మీ సహకారం అందిస్తే ఈ ఊరిని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాను!'.

చిట్టినాయుడు కూడా జగన్నాధం ఉద్దేశాన్ని వివరించి చెబుతున్నాడు.

'మీ అభిప్రాయం హర్షనీయం. గతంలో పనిచేసిన యం.ఎల్.ఎ. గారు ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం ముందర చెక్కల వంతెన కట్టించారు. కొంత కాలం బల్లకట్టు మూలపడింది. తర్వాత పక్కా బ్రిడ్జిల కోసం ప్రపోజల్స్ కూడ పంపించారు. తర్వాత నెమ్మదిగా ఇక్కడ నాగరికత పెరగడం మొదలైంది.

ఐ మీన్ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడటం జరిగింది. వారితో పాటు వారి విలాసాలు. బ్రాందీ షాపులు తెరిచారు. నైట్‌క్లబ్‌లు, పేకాట క్లబ్‌లు మొదలు పెట్టారు. ఇంకా ముందు కెళ్ళి వ్యభిచారగృహాలు వెలిశాయి. వాటి కోసం పోలీసుల రంగప్రవేశం. క్లబ్‌ల మీద, ఆ ఇళ్ల మీద దాడులు, తద్వారా ఊరిలో కొంత అశాంతి. బ్రిడ్జి కట్టించిన ఎం.ఎల్.ఎ గారే పోలీస్ స్టేషన్ కూడా పెట్టించాలని ట్రై చేశారు. తద్వారా నేరాలు, కలహాలు!

'ఊరంతా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషసంస్కృతికి అంకురార్పణ జేసిన ఆ కర్రల వంతెననను కూల్చిపడేశాము. మరల మేము.. మా బల్లకట్టు అప్పుడు అన్నీ సర్దుకున్నాయి. కాబట్టి ఇక్కడ ఇలాగే బాగుంది.'

ప్రెసిడెంట్ గారి మాటలు జగన్నాధాన్ని ఆలోచనల్లో పడేస్తున్నాయి. ఒక రియల్ విలేజ్‌ని చూస్తున్నాడు తాను. ఆ ఊరి కట్టుబాట్లు అమితంగా ఆకర్షిస్తున్నాయి జగన్నాధాన్ని.

మట్టిపొరల్లోని ముడిలోహం.. ముచ్చటైన స్వర్ణాభరణంగా మారాలంటే ఎంతగా శ్రమించాలో, మనసు పొరల్లోని స్వరఘురి... గళం వాకిట్లో  సన్మంగళ గీతంలా ప్రవహించేందుకు అంతలా తపించాలి... తపస్సు చేయాలి!

ఆ చిన్న పల్లెటూరు తీరుతెన్నులు బాగున్నాయి. అందుచేత తాను దత్తత తీసుకుందామనుకున్నాడు. కానీ ఆ ఊరే తనను దత్తత తీసుకోవడం, మనసులో మధురిమను ప్రోదు చేస్తోంది.

'నిస్వార్ధంగా ఎం.జె.ధన్‌ గా కాక మేడిచర్ల జగన్నాధంగా ఇక్కడ మిగలడానికే నిశ్చయించుకున్నాను..

మనసు మూలాల్లోంచి తన్నుకొస్తున్న మాటను వారితో అంటున్నాడు.

మూలం: మనసు మూలాల్లోకి........


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in