|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఉగాది
ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా న్క్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
శ్లోకం
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడిని తీసుకోవాలి.
'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము. ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ, దేవి పూజ సదృశమైంది. అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం. అదే దేవి స్వరూపం. అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది. విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.
శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచిచెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.
ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది. అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.
మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.
మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60 సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
పంచాంగ శ్రవణం
నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి
"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.
ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం. "పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7 వారాలు , అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
నవనాయకులు
1. రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
2. మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
3. సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
4. సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
5. ధాన్యాధిపతి - సూర్యుడు ధనస్సురాశిలోనికి ప్రవేశించేనాటికి వారానికి అధిపతి.
6. ఆర్ఘ్యాధిపతి - ధరలకు, వాణిజ్యాలకు, అధిపతి అర్ఘ్యాధిపతి. సూర్యుడు మిధునరాశిలోనికి ప్రవేశించే నాటివారానికి అధిపతిని ఆర్ఘ్యాధిపతిగా చెబుతారు.
7. మేఘాధిపతి - సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
8. రసాధిపతి - సూర్యుడు తులారాశిలో ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
9. నీరసాధిపతి - సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
ఈ తొమ్మిది మంది నవనాయకులను ఆధారంగా చేసుకుని సంవత్సరంలో జరగబోయే వివిధ ఫలితాలు, లాభనష్టాలు, సంఘటనలు, ప్రమాదాలు వంటి వాటిని పంచాంగకర్తలు అంచనా వేస్తారు.
ఉపనాయకులు:
పురోహితుడు, పరీక్షకుడు, గణకుడు, గ్రామపాలకుడు, దైవజ్ఞుడు, రాష్ట్రాధిపతి, సర్వదేశోగ్యపతి, అశ్వాధిపతి, గణాధిపతి, పశువులకధిపతి, నరాధిపతి, గ్రామాధీశుడు, వస్త్రాధిపతి, రత్నాధిపతి, వృక్షాధిపతి, జంగమాధిపతి, సర్వాధిపతి, మృగాధిపతి, శుభాధిపతి, స్త్రీలకధిపతి, దేవాధిపతి అనే ఇరవై ఒక్కమంది ఉపనాయకులు. వీరికి కూడా అధిపతులు గ్రహాలే! పంచాంగ శ్రవణంలో ఈ ఉపనాయకులను గురించి కూడా తెలుసుకొనడం ఆచారం.
నవనాయకులు, ఉపనాయకులతో పాటు పంచాంగ శ్రవణంలో వివిధ రాశులవారి ఆదాయ కందాయ ఫలాలు, సంవత్సర ఫలాలు తెలుసుకోవడంతోపాటు , సంక్రాంతి పురుషుడు, అతనిపేరు, వాహనం, ఆయుధాలు వంటి వాటిని కూడా తెలుసుకొనడం ఆచారం. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయడంవల్ల అనేక ఫలాలు లభిస్తాయని శాస్త్ర వచనం.
"సూర్య:శౌర్యమనేందురింద్ర పదవీం ! సన్మంగళ:
సద్బుద్దించబుధో గురుశ్చగురుతాం శుక్రస్సుఖం శంశని:
రాహుర్బాహుబలం కరోతు సతతం కేతు: కులస్యోన్నుతిం
నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేకీలత్రగ్రహ:"
పంచాంగ శ్రవణం వల్ల సూర్యుడివల్ల తేజస్సు, శౌర్యము, చంద్రుడివల్ల వైభవము, కుజుడివల్ల సర్వమంగళములు, బుధుడివల్ల బుద్ధి వికాసము, గురుడివల్ల జ్ఞానము, గురుకృప, శుక్రుడివల్ల సుఖము, శనివల్ల దు:ఖరాహిత్యము, రాహువువల్ల ప్రాబల్యము, కేతువు వల్ల ప్రాధాన్యత కలుగుతాయని చెప్పబడుతూ వుంది. అంటే పంచాంగం శ్రవణం సమయంలో వివిధ గ్రహాలను స్మరించడం జరుగుతుంది. అందువల్ల వాటి శుభదృష్టి మనపై పడి ఈ విధంగా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్ర వచనం.
అంతే కాకుండా పంచాంగ శ్రవణం వల్ల పంచాంగంలోని ఐదు అంగాలు ఐదు ప్రయోజనాలు కలిగిస్తాయని చెప్పబడుతూ వుంది. పంచాంగ శ్రవణంవల్ల తిధి సంపాదనను ప్రసాదిస్తుంది. వారం ఆయుష్షును పెంపొందిస్తుంది. నక్షత్రము పాపాలను తొలగిస్తుంది.యోగం వ్యాధులను నయం చేస్తుంది. కరణం కార్యాలను సిద్ధింపజేస్తుంది. అంతే కాకుండా కాలం తెలిసి కర్మచేసే బుద్ధిమంతుడు భగవంతుడియొక్క అనుగ్రహం పొందుతాడని శాస్త్రవచనం.
"తిధేశ్చ శ్రియమాప్నోతి వారదాయుష్యవర్ధనమ్
నక్షత్రాత్థరతే పాపం యోగాద్రోగనివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగఫలముత్తమమ్
కాలా విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రహం లభేత్||"
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 26-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in