telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

వంటలు (కొన్ని)

తోటకూర పులుసు కూర

కావలసిన వస్తువులు:

తోటకూర - 2 కట్టలు.
పెద్ద ఉల్లిపాయలు - 2.
టమోటాలు - 2.
చింతపండు గుజ్జు - 2 చెంచాలు.
కారం - చెంచాడు.
ఉప్పు - తగినంత.
పచ్చిమిర్చి - తగినన్ని ముక్కలు.
తాలింపు గింజలు - తగినన్ని.

తయారు చేసే విధానం:

ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆ తర్వాత ఓ గిన్నెలో తాలింపు వేసి ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత తోటకూర తరుగు వేసుకుని చింతపండు గుజ్జు, ఉప్పు కారం వేసి గ్లాసు నీరు పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే మీరు ఎంతగానో ఇష్టపడే తోటకూర పులుసు కూర సిద్ధం.


[ వెనుకకు ]


సొరకాయ, తోటకూర కూర

కావలసిన వస్తువులు:

సొరకాయ - 1 కప్పు ముక్కలు.
తోటకూర - 2 కట్టలు.
చింతపండు గుజ్జు - 2 చెంచాలు.
కారం - చెంచాడు.
టమోటా - కప్పు ముక్కలు.
ఉల్లిపాయ - కప్పు ముక్కలు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా తోట కూర తరిగి సిద్ధం చేసుకోవాలి. తరిగిన కూరను తిరగమోత వేయాలి. అందులో సొరకాయ, టమోటా, పచ్చి మిరప, ఉల్లి ముక్కలు వేసి బాగా ఉడికించాలి. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు, కారం, ఉప్పు వేసి సన్నని సెగపై ఉడకనియ్యాలి. మెత్తగా ఉడికిన తర్వాత దించేసి దానికి ఓ చెంచాడు నేయిని కలిపి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.


[ వెనుకకు ]


బీరకాయ వంకాయ కూర

కావలసిన వస్తువులు:

వంకాయలు - పావు కిలో.(సన్నగా పొడవుగా వుండేవి)
బీరకాయలు - పావు కిలో.
ధనియాలు - 1 టీ స్పూను.
మినపప్పు - 1 టీ స్పూను.
శనగపప్పు - 1 టీ స్పూను.
ఎండుమిర్చి - ఆరు.
ఇంగువ - చిటికెడు.
పసుపు - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.
చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు.
కొబ్బరి తురుము - అర కప్పు. (ఎండుదయితే బాగుంటుంది)
నూనె - అర కప్పు.

తయారు చేసే విధానం:

బీరకాయలు తొక్కు తీసి సన్నగా పొడవుగా కోసి పెట్టుకోవాలి. వంకాయలు కూడా అదే సైజులో కోసి నీళ్లలోనే ఉంచాలి. కళాయి స్టవ్‌మీద పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి మిరపకాయలు, మిగిలిన పోపు సామాను వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి. అదే కళాయిలో మిగిలిన నూనె వేసి కాగాక వంకాయముక్కలు, బీరకాయ ముక్కలు వేసి, ఉప్పు, పసుపు వేసి కలిపి మూతపెట్టాలి.

వేయించి ఉంచిన పోపు సామాను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి కూరలో వేయాలి. మధ్యలో కలుపుతుండాలి. సగం ఉడికిన తరవాత మంట తగ్గించాలి. పూర్తిగా ఉడికిన తరవాత కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి దించాలి. ఇది అన్నంలోకీ చపాతీలోకీ బాగుంటుంది.


[ వెనుకకు ]


పాలక్ పన్నీర్

కావలసిన వస్తువులు:

పాలకూర - రెండు కట్టలు.
మెంతి కూర - అర కట్ట.
టమోటాలు - 3 (పెద్ద సైజు).
పచ్చిమిర్చి - 5.
వెల్లుల్లి రేకలు - 5.
అల్లం - ఒక పెద్ద ముక్క
తరిగిన ఉల్లిపాయ - 1.
కారం - ఒక టీ స్పూను.
జీలకర్ర పొడి - ఒక టీ స్పూను.
దనియాల పొడి - ఒక టీ స్పూను.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి సరిపడా.
వేయించిన పన్నీర్ క్యూబ్స్ - ఒకటిన్నర కప్పు.

తయారు చేసే విధానం:

పాలకూర, మెంతికూర, అల్లం, పచ్చిమిర్చి, టమోటాలను సన్నగా తరగాలి. ఒక బాణలిలో రెండు కప్పుల నీళ్లు పోసి వీటన్నిటినీ పావుగంట సేపు ఉడికించాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా నూనెను వేడి చేసి ఉల్లి ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. పొడులన్నిటినీ వేసి బాగా కలపాలి. తర్వాత పాలకూర పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. వేగించిన పన్నీర్ క్యూబ్స్‌ను కూడా వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. దీనిని చపాతీ, నాన్‌లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.


[ వెనుకకు ]


వెల్లుల్లి పచ్చడి

కావలసిన వస్తువులు:

వెల్లుల్లిరేకులు - 4 కప్పులు.
కారం - 1 కప్పు
ఉప్పు - ముప్పావు కప్పు.
మెంతిపొడి - పావుకప్పు.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవపిండి - అర కప్పు.
ఇంగువ - అర టీ స్పూను.
నిమ్మరసం - 1 కప్పు.
నువ్వులనూనె - 2 కప్పులు.
పసుపు - పావు టీ స్పూను.

తయారు చేసే విధానం:

వెల్లుల్లి రేకుల్ని పొట్టుతీసి శుభ్రం చేయాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా కలిపిన తరువాత మిగిలిన నువ్వుల నూనెను పచ్చడిమీద పోయాలి. గాలి చొరవకుండా నిల్వచేస్తే ఆరు నెలలపాటు పాడవకుండా ఉంటుంది.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం