telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

కానుకలు

కానుకలు

ఆప్తులకు కానుకలివ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. దీని పుట్టుపూర్వోత్తరాలకు ప్రత్యేక కథ ఏమీ లేదనే చెప్పవచ్చు. వస్తు మార్పిడి విధానం నాటినుండే ఈ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం అనే సంప్రదాయం ఉండిఉండొచ్చు. కరెన్సీ చెలామణీ లేని రోజుల్లో బార్టర్ సిస్టం (వస్తు మార్పిడి విధానం) ద్వారా ఒకరికొకరు వస్తువులను ఇచ్చిపుచ్చుకునేవారు. ఒకరి ఇంటిలోని వస్తువులను వేరొకరికి ఇవ్వడం ద్వారా ఈ ఇతరులనుండి తమకు కావలసిన వస్తువూలను పొందేవారు. ఆ వస్తు మార్పిడే కానుకగా రూపాంతరం చెందిందనవచ్చు. తర్వాత్తర్వాత అది ఒక గౌరవంగా రూపాంతరం చెందింది. ఇంటికొచ్చిన వారికి ఏదో ఒక భోజన పదార్ధాన్ని పెట్టడం, లేకుంటే ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు వస్తువులను తీసుకెళ్ళి వాళ్ళకివ్వడం ద్వారా అనుబంధాన్ని పెంచుకునే ఆ విధానంలో ఎన్నో మార్పులు, చేర్పుల అనంతరం కానుకల సంప్రదాయం ఏర్పడింది.

ముఖ్యంగా రాచరిక వ్యవస్థలో ఈ కానుకల సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంటుంది. బలవంతులైన పొరుగు రాజునుంచి యుద్ధ భయాన్ని తొలగించుకోవడానికి ఇతర రాజులు వారికి మణులు, మాణ్యాలు కానుకలుగా ఇచ్చి సంధి చేసుకునేవారు. అంతేకాక కొందరైతే స్త్రీలను కూడా కానుకలుగా సమర్పించుకునేవారు. కానుకల బలహీనత ఈ సందర్భాల్లో బయటపడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారత దేశానికి చెందిన కోహినూర్ వజ్రం ఒక కానుకగానే బ్రిటిష్ రాణికి చేరింది. ఆ విధంగా మనం ఓ అపూర్వ వజ్రాన్ని కోల్పోయాము. కానుకలు అంతోసహాన్నే కాదు,ఖేదాని కూడా మిగుల్చుతాయి అనడానికి ఇది ఓ ఉదాహరణ. అంతెందుకు? ఇటీవలే ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన తాజ్ మహల్ ప్రేమ కానుకగా ఎంత విఖ్యాతి పొందిందో తెలియందికాదు.

కానుకలు అలనాటి ఈ సంప్రదాయం నవీన భారతావనిలో ఓ ఆచారంగా చెలామణీ అవుతోంది. ఇచ్చిపుచ్చుకోవడమనేది పెద్దల మధ్యనేగాక నేడు ఎక్కువగా యువతలో ప్రవృద్ధి చెందింది. ముఖ్యంగా పుట్టిన రోజు వేడుకలలఒ పుట్టిన రోజు పందుగను జరుపుకుంటున్న వ్యక్తికి కానుకలు సమర్పించకుండా ఆ కార్యక్రమానికి వెళ్ళడం బాగోదనే అభిప్రాయంతో ఆ వ్యక్తి స్నేహితులు, సన్నిహితులు కానుకలతో ఆ వ్యక్తిని సంతోషపెడుతున్నారు. ఒక్క సందర్భమేంటి? పెళ్ళి సందర్భంగానేకాక, పెళ్ళి రోజుకీ కానుకలివ్వడం నేడు పరిపాటయ్యింది. వేలెంటైన్స్ డే సందర్భంగా, పరీక్షలో కృతార్ధుడైనా, ఒక దుకాణం ప్రారంభించినా, శీమంతం, నామకరణం, అన్నప్రాశన, ఇలా ప్రతి సందర్భానికీ కానుకల హడావిడి నేడు సర్వ సాధారణం అయ్యింది.

కానుకలు ఈ కానుకలు ఇచ్చే అలవాటు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. విదేశంలో ఉన్న మన మిత్రుడికి ఒక కానుకను మనం పంపించాలంటే ఆ దేశ సంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే జర్మనీ అతిధులకుగానీ, మిత్రులకుగానీ ఎర్ర గులాబీ పువ్వును కానుకా ఇవ్వకూడదు. ఎర్ర గులాబీలు ప్రేమికులు మాత్రమే ఇచ్చి పుచ్చుకునేవని వారి అభిప్రాయం.

అరబ్ దేశాల్లో ఆహ్వానించిన వారింటికి వెళ్ళినప్పుడు ఆహ్వానించిన వారి భార్యకు కానుకలు ఇవ్వడం ఆచార విరుద్ధం. జపానులోనైతే ఎంత ప్రయోజనకరమైన విలువగల కానుక ఇచ్చినా ఒక్కొక్కప్పుడు తిరిగి సరిసమానంగా కానుకను ఇవ్వలేమనే అభిప్రాయంతో కానుకలను అభిలషించరు. చైనా గడియారాలు ఉత్తర క్రియలతో సంబంధించి ఉంటాయి. కాబట్టి వీటిని కానుకలుగా ఇవ్వడం ఆచార విరుద్ధం. ఫ్రాన్స్‌లో చిరపరిచితులైన స్నేహితులకు, బంధువులకు సువాసన ద్రవ్యాలు కానుకలుగా ఇస్తూండడం సంప్రదాయం. ఇంగ్లండులో గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడాన్ని హర్షించరు. అమెరికాలో వ్యక్తిగత ఆదరాభిమానాలకు తగినట్లుగా ఇష్టమొచ్చిన కానుకను ఇవ్వవచ్చు. ఏది ఇచ్చినా సరసంగా గ్రహిస్తారు. ఇక భారతదేశంలో చాకులు, చేతిరుమాళ్ళు ఇవ్వడం నిషేధం. చాకులు హింసాసూచకం, చేతి రుమాళ్ళు కన్నీళ్ళు తుడుచుకోడానికి ఉపయోగపడతాయి కాబట్టి.

నిజానికి ఆత్మీయతతో కూడిన ఓ చిన్న చిరునవ్వును మించిన అపూర్వ కానుక మరోటుంటుందా?

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం