telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

సమస్యను మించిన పరిష్కారం

పూర్వం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ఆ చక్రవర్తికి సుప్రసిద్ధుడైన మంత్రి పుంగవుడు ఉండే వాడు. అతడు మంచి కుశాగ్రబుద్ది గల ప్రజ్ఞావంతుడు. సమర్ధుడు. రాజ్యపాలనకు సంబందించిన అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు చక్రవర్తికి తగిన సలహాలను ఇస్తుండేవాడు. దూరదృష్టితో వివేకవంతమైన ఆ సలహాలను చక్రవర్తి జవదాటకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ మంత్రిగారి సహాయం, సలహాలు లేకపోతే రాజ్యపాలన కుంటుపడిపోతుందనే అభిప్రాయం చక్రవర్తికి కలిగింది. మంత్రి కూడా మానవ మాత్రుడు. పుట్టిన వారు గిట్టక మానరు. మంత్రి మరణిస్తే రాజ్యం ఎలా పాలించాలో తెలియక మానసిక చింతతో క్రుంగిపోతున్నాడు చక్రవర్తి. సానుభూతితో తనకు ఎప్పటికప్పుడు సలహాల నిచ్చే ప్రజ్ఞావంతుడైన మరో మంత్రి ఎలా లభిస్తాడు అని అనుకున్నాడు చక్రవర్తి. ఒక రోజున చక్రవర్తి మంత్రిని పిలిచి సంగతి చెప్పి సూక్ష్మబుద్ధిగల ఒక యువకుని ఎన్నుకుని భవిష్యత్తులో తనకు మంత్రిగా సహకరించడానికి అతడికి తగిన శిక్షణను, నేర్పును ఇవ్వమని కోరాడు. మంత్రి కూడా దానికి గల ఆవశ్యకతను, అవసరాన్ని గ్రహించి రాజ్యంలో సూక్ష్మబుద్ధి గల వానిని ఎన్నుకోడానికి అంగీకరించాడు.

తగిన ఉపాయం ఆలోచించి ఒక పెద్ద డ్రాయింగు కాగితం తెప్పించి దానిమీద నిలువుగా ఒక సరళరేఖ గీశాడు. దీనిని రాజదూతల కిచ్చి రాజ్యంలో నాలుగు మూలలా పిన్నలకు, పెద్దలకు, ధనికులకు, దరిద్రులకు అందరికి చూపించమన్నాడు. డ్రాయింగు కాగితం మీది ఆ రేఖను ముట్టకుండా, చెరపకుండా చిన్నదిగా ఎవరు చేస్తారో వారికి చక్రవర్తి గారి అపూర్వ బహుమానం లభిస్తుందని చెప్పమన్నాడు. రాజదూతలు ఆ కాగితం పట్టుకుని అందరికి చూపించారు. నిబంధలను విశదీకరించారు. చక్రవర్తి గారి బహుమానం విషయం వివరించారు. చక్రవర్తి గారి బహూమానం అంటే మాటలా! ఎవరికి ఆశ ఉండదు! కాని ఆ రేఖను ముట్టుకోకుండా, చెరపకుండా చిన్నదిగా ఎలా చేయడం? ఇది అసాధ్యం, మావల్ల కాదంటే కాదు అని చూచేవారు అందరూ పెదవులు విరిచి తలలు ఆడించేశారు.

ఊరూరు, పల్లె పల్లె తిరిగి చిట్టచివరికి ఆ దూతలు ఒక చిన్న గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో మాత్రం సాహసించిన వారెవరు? ఎవ్వరూ లేకపోయరు. ఆ గ్రామంలోనే ఒక పాఠశాలకు వెళ్ళారు దూతలు. అక్కడ అందరికి చూపించారు. ఆ కాగితం విషయం వివరించారు. ఉపాధ్యాయులు తమవల్ల కాదన్నారు. విద్యార్ధులు కూడా తలలు ఊపేశారు. కాని విద్యార్ధులలో ఒకడు నిర్బయంగా ధైర్యంతో లేచి నుంచున్నాడు. 'అయ్యా! నేను చేయనా?' అన్నాడు. అక్కడ ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు అందరూ అవిశ్వాసాన్ని ప్రకటించారు. అసాధ్యమైన దానిని ఈ బాలుడు ఎలా చేయగలడు అని అందరూ ఆశ్చర్యపడి పోతున్నారు. పరిహాసాల పాలు కావద్దని గీతను ముట్టకుండా, చెరపకుండా చిన్నది చేయడం అసంభవమని ఆ బాలుణ్ణి మందలిస్తూ కూర్చోమన్నారు. "ప్రయత్నం చేయనీయండి. తప్పులేదు. ఇతడొక్కడే చేస్తానంటూ ముందుకు వచ్చాడు" అన్నారు రాజదూతలు. ఆ కాగితాన్ని ఆ బాలుడి చేతికి ఇచ్చారు. బాలుడు ముందుకు వచ్చాడు. ఒక పెన్సిలు తీసుకొని ఆ నిలువు రేఖ ప్రక్క మరో నిలువురేఖ గీశాడు. ఈ క్రొత్త గీత మొదట ఇచ్చిన గీత కంటే రెండు, మూడు అంగుళాలు పెద్దదిగా ఉంది. బాలుడు "ఇప్పుడు చూడండి, మొదట ఇచ్చిన గీత నా గీత కంటే చిన్నదేనా? కాదా?" అన్నాడు.

నిజమే. క్రొత్తగా గీసిన గీతకంటే మొదట ఇచ్చిన గీత చాలాచిన్నదిగా కనిపించింది. అందరూ ఆ బాలుని చాతుర్యం, సౌలభ్యం, బుద్ధికుశలత 'మెచ్చుకుని ఆశ్చర్యపడిపోయారు. ఈ బాలుడు చూపగలిగిన చాకచక్యాన్ని ఎవ్వరూ చూపించలేక పోయినందుకు అందరూ చిన్నబుచ్చుకున్నారు. మంత్రిగారు ఆ బాలుడే తన తరువాత మంత్రిపదవికి అర్హుడు కాగలడని అతడికి తగిన శిక్షణను ఇచ్చాడు. ఇతడే పెరిగి పెద్దవాడై విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్ధాపించిన శ్రీ కృష్ణదేవరాయలవారి మంత్రి తిమ్మరుసు. ఈ మంత్రి విజయనగర సామ్రజ్యాన్ని స్ధాపించడానికి తాను బాల్యంలో అవలంబించిన సిద్ధాంతాన్నే అనుసరించాడు. సమస్యలను మించిన పరిష్కారాలతో సమస్యలు సమసిపోతాయి!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం